ఏపీ ఫైబర్ నెట్ ద్వారా గత చంద్రబాబు ప్రభుత్వం చాలా అక్రమాలకు పాల్పడిందని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చి, రెండేళ్ళయినా ఆ ఆరోపణల నిగ్గు తేల్చలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. కాస్త లేటుగా అయినా, ఈ వ్యవహారంలో సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో చిత్తశుద్ధి ఎంత.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అమరావతి కుంభకోణంపై ఉక్కుపాదమంటూ గడచిన రెండేళ్ళుగా కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే నడిచాయి. ఇంకేముంది చంద్రబాబు జైలుకెళ్ళడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతలా హడావిడి నడిచింది. కానీ, ఆ కేసు ముక్కీ మూలిగీ.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
ఈఎస్ఐ మెడికల్ స్కాం విషయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి వ్యవహారమైనా, ఓ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విషయంలో అయినా.. అరెస్టులు జరిగినా, ఆ తర్వాత ఆ కేసుల విచారణ ఎక్కడిదాకా వచ్చిందన్నది మాత్రం అయోమయంగా తయారైంది. రేప్పొద్దున్న ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం కూడా అంతే కాబోతోందా.? అన్నదే చాలామందికి డౌటానుమానం.
ప్రభుత్వం తరఫున కేసులు పెట్టడం, అధికార పార్టీ అనుకూల మీడియాలో కథనాలు రాస్తూ, టీడీపీ నేతలపై ‘దొంగ’ ముద్ర వేయడం.. ఆ తర్వాత వ్యవహారం అంతా కామప్ అయిపోవడం.. ఇదే జరుగుతోంది రెండేళ్ళుగా. ఇక, ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో నారా లోకేష్ అరెస్ట్ ఖాయమంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. నిజమేనా.? అంత చిత్తశుద్ధి అధికార పార్టీకి వుందా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది.