AP Employees : ఏపీ ఉద్యోగుల కొత్త రచ్చ.. హీటెక్కుతున్న రాజకీయం

AP Employees : ‘ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్ని కొన్ని రాజకీయ శక్తులు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది.. ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతల తీరుతోనే ఈ సమస్య..’ అంటున్నారు ఏపీకి చెందిన ఓ మంత్రి.

కొత్త పీఆర్సీ, సీపీఎస్ రద్దు.. ఇలాంటి వ్యవహారాలపై గత కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఉద్యోగ సంఘాలు ఆశించిన రీతిలో కాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకుని, తదనుగుణంగా కొంత ఊరట ఉద్యోగులకు ఇచ్చే ప్రయత్నమైతే జరిగింది.

ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్ని ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతించారు కూడా. ఇది సంక్రాంతి పండగకి ముందు మాట. సంక్రాంతి గడిచాక సీన్ మారింది. ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగ సంఘాల నేతలు సమాయత్తమవుతున్నారు. కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటున్నారు.. ఇంకేవేవో విమర్శలు చేస్తున్నారు.

నిజానికి, ముఖ్యమంత్రితో సమావేశం సమయంలోనే ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి వుండాల్సింది. అలా చేసి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. దాంతో, ఉద్యోగుల్లోనూ స్పష్టమైన చీలిక కనిపిస్తోంది.

‘ఇదెక్కడి చోద్యం.? అప్పుడు అద్భుతమన్నారు.. ఇప్పుడేమో విమర్శిస్తున్నారు.. ఇలాంటివాళ్ళవల్లే ఉద్యోగులకు నష్టం జరుగుతోంది..’ అంటూ ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగులే విరుచుకుపడుతున్న పరిస్థితి.ఉద్యగ సంఘా లనాయకులకీ, ఉద్యోగులకీ మధ్య చిచ్చు పెట్టడంలో అధికార పార్టీ సఫలమైందా.? ఉద్యోగ సంఘాల నేతలే అడ్డంగా బుక్కయిపోయారా.? అన్నది వేరే చర్చ. ఉద్యోగుల రచ్చ మాత్రం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేస్తోంది.