HomeNewsఉత్తమ సంప్రదాయాలను నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి

ఉత్తమ సంప్రదాయాలను నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి

Ap Cm Upheld Best Traditions Values During Election Leads To Victory

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రశాంతంగా జరగడం విశేషం. గత మూడు దశాబ్దాలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విధ్వంసం, హింసాకాండ, ఘర్షణలు, కొట్లాటలు సర్వసామాన్యంగా సంభవిస్తుండేవి. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వాటి సెగలు సందర్భానుసారంగా రగులుతుండేవి. తద్భిన్నంగా ఈ సారి కొందరు తెలుగుదేశం నాయకులు కావాలని సృష్టించిన స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినట్లు చెప్పుకోవాలి. అధికార యంత్రాంగం చాల సంయమనంతో వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిపించడం అభినందించదగిన విషయం. ఎన్నికల కమీషనర్ కొన్ని తుగ్లక్ పనులకు పాల్పడినా, వెంటనే కోర్టు జోక్యం చేసుకుని వాటిని నివారించడం, ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టడం తప్పకుండా ప్రశంసించాల్సిన ఘట్టం.

అయితే ఇందులో చెప్పుకోదగిన విశేషం ఏముందిలే అనుకోవచ్చు. ఈతరం వారికి తెలియని ఒక గొప్ప సంప్రదాయం ఈ ఎన్నికల వేళ పాటించబడింది. ఆ సంప్రదాయాన్ని పాటించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రులు పాలిస్తున్న సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ ల ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ప్రచారం చేసేవారు కారు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా అది ఏదో మొక్కుబడి వ్యవహారంగా ముగిసేది. ఎందుకంటే తాము రాష్ట్రస్థాయి నాయకులమని, చిన్న చిన్న ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకుని వెళ్లి ప్రచారం చెయ్యడం తమ ప్రతిష్టకు భంగంగా భావించేవారు ఆనాటి నేతలు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు తమ స్థాయివారు వెళ్తే అక్కడి శాంతిభద్రత్రతలకు విఘాతం వాటిల్లుతుందేమో అన్న అభిప్రాయంతో పాటు స్థానిక అధికారులు తమ విధులను వదిలి తమ చుట్టూ తిరుగుతారని, తమకు మర్యాదలు చెయ్యడంలో మునిగిపోతారని భయపడేవారు. అందుకే ఎన్నికల ప్రచారానికి వెళ్లేవారు కారు. అది ఒక మంచి సంప్రదాయంగా చెప్పుకునేవారు.

కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత అలాంటి సంప్రదాయాలకు, మర్యాదలకు స్వస్తి పలికారు. పంచాయితీ వార్డ్ మెంబర్ ఎన్నికలైనా సరే, చంద్రబాబు ఆగమేఘాలమీద అక్కడికి ప్రచారానికి వెళ్లడం, ప్రత్యర్థులను భయపెట్టడం, డబ్బు పంపిణీని పర్యవేక్షించడం లాంటి అనైతిక సంప్రదాయాన్ని మొదలు పెట్టారు. ఇక అప్పటినుంచి అందరూ దాన్ని కొనసాగించారు.

నిన్నటి ఎన్నికల్లో చూడండి…చంద్రబాబు తన నలభై ఏళ్ళ అనుభవాన్ని కూడా మర్చిపోయి, పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలకు కూడా ప్రచారానికి వెళ్లి, ప్రభుత్వాన్ని దూషిస్తూ, జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతూ, అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తూ, తమకు ఓట్లు వెయ్యని ప్రజలను నిందిస్తూ, వారికి సిగ్గూశరం, రోషం, అభిమానం లేవని రెచ్చగొడుతూ, స్థానిక పోలీసులను తిట్టిపోస్తూ ప్రచారాన్ని పరమరోతగా దిగజార్చారు.

కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీవారి కోసం ఎక్కడా ప్రచారం చెయ్యలేదు. ప్రభుత్వ కార్యకలాపాలకు విఘ్నం కలగకుండా ప్రచారభారం మొత్తాన్ని స్థానిక నాయకులకే వదిలివేశారు. తన ప్రభుత్వం చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలనే ఆయుధాలుగా ఎన్నికల్లో ప్రయోగించి తాను మాత్రం కాలు కడపలేదు. ప్రత్యర్థి పార్టీలను నోరెత్తి దూషించలేదు. ఆయనకు అనుభవం లేకపోయినా బోలెడంత రాజనీతిజ్ఞత, రాజకీయపరిణీతి ఉన్నాయని ఎన్నికల సాక్షిగా నిరూపించారు. అలనాటి మహానాయకులు నెలకొల్పిన సంప్రదాయాన్ని పాటించి అత్యుత్తమ రాజకీయనాయకుడిగా తనను తాను ప్రజలదృష్టిలో ముద్రవేయించుకున్నారు. ఇది నిజంగా అభినందించదగిన విషయంగా చెప్పుకోవాలి. ఏమీలేని ఆకు చంద్రబాబులా ఎగిరెగిరి పడుతుందని నిరూపించారు.

మురికినీరు పెద్దగా శబ్దం చేస్తూ పారుతుంది. గంగానది మాత్రం నిశ్చలంగా ప్రవహిస్తుందని పెద్దలు చెప్పలేదా!

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ
విశ్లేషకులు

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News