విజయసాయిరెడ్డి.. వైసీపీ ఎంపీ. అంతేనా. కాదు.. ఆయన వైసీపీ పార్టీకి పెద్దదిక్కు. జగన్ తీసుకునే నిర్ణయాల్లో ఆయన హ్యాండ్ కూడా ఉంటుంది. విజయసాయిరెడ్డి… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటంతో పాటు.. చంద్రబాబును విమర్శించడంలో దిట్ట.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ పార్టీ తన స్పీడ్ ను పెంచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసి.. రాజకీయాలు చేస్తోంది బీజేపీ. వైసీపీ నేతలు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్లను విమర్శించడం మొదలు పెట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత రావాలి. అందుకోసమే.. బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.
వైసీపీ మెయిన్ లీడర్స్ ను బీజేపీ టార్గెట్ చేసింది. అందులో విజయసాయిరెడ్డి ఒకరు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం పౌర విమానాశ్రయాన్ని మూసేయాలంటూ… విజయసాయి కేంద్రమంత్రికి లేఖ రాయడంపై మాధవ్ మండిపడ్డారు.
అసు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రాకముందే.. విశాఖ విమానాశ్రయాన్ని ఎలా మూసేస్తారు.. అంటూ విజయసాయిరెడ్డిని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయంలోనూ ఎయిర్ పోర్ట్ అథారిటీకి 40 శాతం వాటా ఉండాలని.. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు మరో నేత విష్ణుకుమార్ రాజు కూడా ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. విశాఖ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని లేఖ రాయడం ఏంటి?.. అంటూ ప్రశ్నించారు. పౌర విమానాశ్రయాన్ని మూసేసి.. ఏం చేస్తారు. ప్రజలకు ఉపయోగపడేదాన్ని మూసేస్తే వచ్చే లాభం ఏంటి? భోగాపురం విమానాశ్రయం ట్రాన్స్ పోర్ట్ కు చాలా ఖర్చవుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నదాన్ని మూసేయాలంటూ విజయసాయి లేఖ రాయడం దేనికి నిదర్శనమంటూ ఆయన విమర్శించారు.