ఏపీ హోం మంత్రి సుచరితపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు

AP BJP Sensational tweet on Home Minister Sucharitha

AP BJP Sensational tweet on Home Minister Sucharitha

ఆంధ్రపదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత దళితురాలు కాదంటూ సంచలన ఆరోపణ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, వైసీపీకి చెందిన దళిత నేతల మీద మతం పేరుతో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ లిస్టులో తాజాగా మేకతోటి సుచరిత పేరు చేరింది. ‘రాష్ట్ర హోం మంత్రి సుచరిత, షెడ్యూల్డు కులానికి కేటాయించిన స్థానం నుంచి ఎన్నికయ్యారు. నిజానికి ఆమె ఒక క్రిస్టియన్. దళితుల్ని వెనక్కి నెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, రాష్ట్ర ప్రజలను మోసం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి రూపంలో వైసీపీ ప్రజలను మళ్ళీ మోసం చేస్తోంది.. ఓటర్లూ జాగ్రత్త’ అంటూ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. బీజేపీ ఆరోపణల్లో నిజం వుందా.? లేదా.? కేవలం, తిరుపతి ఉప ఎన్నిక కోసమే ఈ మత రాజకీయాల్ని తెరపైకి తెస్తోందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మేకతోటి సుచరిత ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్.. అని చెప్పుకున్న మాట వాస్తవం. అయితే, మత మార్పిడి.. అనేది అధికారికంగా జరిగిందా.? లేదా.? అన్నదాన్ని బట్టే రిజర్వేషన్ల వ్యవహారంపై చర్చించడానికి వీలుంటుంది. ఎవరైనా ఏ మత విశ్వాసాలైనా పాటించొచ్చు. హిందువులు, దర్గాలకీ.. చర్చిలకీ వెళుతుంటారు. హిందూ పండుగల్లో క్రిస్టియన్లు, ముస్లింలు పాల్గొంటుంటారు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నవాళ్ళంతా నిజమైన హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు. కొందరు మాత్రం, పరమత సహనం పాటించరు. అలాంటివారితోనే అసలు సమస్య వస్తుంటుంది.

ఇక, మత మార్పిడుల వ్యవహారం విషయానికొస్తే, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో మత మార్పిడులపై రచ్చ జరుగుతోంది. ఇది చంద్రబాబు హయాంలో కూడా జరిగింది. ఇక, మేకతోటి సుచరిత వ్యవహారానికి వస్తే, ఆమె సాక్షాత్తూ ఏపీ హోంమంత్రి. తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఆమె ఎలా స్పందిస్తారు.? తాను హిందూ దళితురాలినంటారా.? లేదంటే, క్రిస్టియన్ అని చెప్పుకుంటారా.? వేచి చూడాల్సిందే.