Anupama Parameswaran: అనుపమ సినిమాకు తప్పని సెన్సార్ తిప్పలు.. పేరు మార్చకపోతే సినిమా విడుదల అవ్వడం కష్టమే!

Anupama Parameswaran: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇందులో కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఇలాంటి నేపథ్యంలో సెన్సార్ నుంచి ఈ మూవీ మేకర్స్ కి ఒక ఊహించని షాక్ ఎదురైంది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. జానకి అనే మహిళ చేసే న్యాయపోరాటం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు నిరాకరించడానికి కారణం సినిమాలో పేరు అని చెప్పాలి. సీతాదేవి మరో పేరైన జానకిని అలాంటి పాత్రకు పెట్టకోలేమని పేర్కొంటూ ఈ చిత్రం స్క్రీనింగ్‌ కు అనుమతి నిరాకరించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరించిందని దర్శకుడు కూడా వెల్లడించారు. ఇక ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించరాదని సెన్సార్‌ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలియజేసినట్లు చెప్పారు.

టైటిల్‌, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్ర బృందానికి సూచించినట్లు తెలిపారు. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టలేమని సెన్సార్ బోర్డు చెప్పిందని అన్నారు. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. వారు సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందడానికి ఆ పేరును జయంతిగా మార్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా విడుదల కావాలి అంటే సినిమాలో జానకి పేరుకు బదులుగా మరొక పేరు పెట్టక తప్పదు. లేదంటే సినిమా విడుదల అవ్వడం కష్టం అని చెబుతున్నారు.. అయితే విడుదల తేదీకి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఈ లోపు పేరును మార్చి సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి మరి.