ఒకప్పుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలు అంటే ఫ్యామిలీ సినిమాలని ఒక మార్క్ ఉండేది. ఆయన సినిమా తీస్తే చాలా సున్నితంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకునేవారు ప్రేక్షకులు. ‘కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఆయన ఫ్లాప్ తీసినా అందులో సున్నితత్వం కొరవడేది కాదు. అలాంటి ఆయన్ను పూర్తిగా మార్చేస్తున్నారు. వరుసగా రీమేక్ కథలను చేతికిచ్చి చేయమంటున్నారు. ఇప్పటికే ఆయన తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’గా రీమేక్ చేశారు.
అది ఇంకా రిలీజ్ కాలేదు. అసలు ఫ్యామిలీ సినిమాల దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాల అంత మాస్ సినిమా ఎలా చేశారు అనేది ఇప్పటికీ ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు ఇలాంటి ఇంకొక ఆఫరే అడ్డాలకు వెళ్లిందట. తమిళంలో ధనుష్ చేసిన కొత్త చిత్రం ‘కర్ణన్’. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా రీమేక్ హక్కులను బెల్లంకొండ శ్రీనివాస్ కొనేశాడు. తానే హీరోగా చేయనున్నాడు. ‘అసురన్’ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా చేశాడనే టాక్ ఇండస్ట్రీలో ఉండటంతో ‘కర్ణన్’ రీమేక్ బాధ్యతను కూడ ఆయనకి అప్పగించాలని చూస్తున్నారట. వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయట. మొత్తానికి ఫ్యామిలీ సినిమాల శ్రీకాంత్ అడ్డాలను రీమేక్ సినిమాల దర్శకుడిగా చేసేశారు.