Anil Geela: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న తెలంగాణ యూట్యూబర్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

Anil Geela: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ యూట్యూబర్ అనిల్ జీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మై విలేజ్ అనే షోతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్. ముఖ్యంగా అతని కామెడీ టైమింగ్స్ అదుర్స్ అని చెప్పాలి. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేసి డబ్బు సంపాదించడంతోపాటు బోలెడంత పాపులారిటి కూడా సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో, సిరీస్ లలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనిల్ జీలా ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ విలేజ్ కామెడీ, లవ్ జానర్లో మై విలేజ్ షో, మధుర శ్రీధర్ నిర్మాణంలో శివ కృష్ణ బుర్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా తాజాగా ఈ సిరీస్ ప్రకటించి టైటిల్, ఫస్ట్ లుక్ ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేసారు మేకర్స్. లంబాడిపల్లి అనే గ్రామంలో ఇద్దరు సోదరులు, ఒక లవ్ స్టోరీ, వారి పెళ్లి చుట్టూ ఈ సిరీస్ కామెడీ థ్రిల్లర్ గా సాగనుందని సమాచారం.

కాగా ఈ సిరీస్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. మోతెవరి లవ్ స్టోరీ అనే టైటిల్, పోస్టర్ కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం. కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్‌ లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడిని. దొరసాని సినిమాకు మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. ఈ సిరీస్‌ కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.