వైఎస్సార్‌సీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ.. అందుకే హస్తినకు వెళ్లుతున్న వైఎస్ జగన్.. ?

 

ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు కనిపించబోతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం ప్లాన్‌ వేస్తోందనే టాక్‌ జోరుగా ప్రచారంలోకి వచ్చింది.. ఇలాంటి ప్రచారం గతంలోనూ ఓసారి జరిగింది. ఇక బీజేపీ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందట. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు ఎరవేసి, అవసరమైతే కేంద్ర కేబినెట్‌లోకి ఆహ్వానిస్తుందంటున్నారు.. ఇలాంటి ప్లాన్‌లో భాగంగానే వైసీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తుందన్న వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఇకపోతే బీజేపీ గద్దెనెక్కినప్పటి నుంచి శివసేన, జేడీయూ, అన్నాడీఎంకేతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలను ఇలానే చేర్చుకొని ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.. అయితే ప్రస్తుతం ఏపీ మీద ఫుల్ ఫోకస్ చేసినట్లుగా ఉంది.. ఆ వెంటనే అమిత్‌షాతో రాయబారం జరగడం.. వైఎస్ జగన్ రెండు సార్లు వెళ్ళి కలిసి రావడం కూడా జరిగింది.. అయితే తాజాగా ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్న విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతే కాదు ఈసారి ప్రధాని మోదీతో సమావేశంకాబోతున్నారని చర్చ కూడా జరుగుతోంది.

కాగా ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారనే టాక్ నడుస్తోంది.. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం తదితర అంశాల ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైసీపీ వర్గీయులు.. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ, వైఎస్సార్‌సీపీ కి కేంద్ర కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని.. అందుకే ఆయన సడన్‌గా ఢిల్లీ వెళుతున్నారని సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఒకరకంగా వైఎస్సార్‌సీపీకి ఇది బంపర్ ఆఫర్ అంటున్నారు.. కానీ మరోవార్త ఏంటంటే వైఎస్సార్‌సీపీ కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు సుముఖతతో లేదని.. అందుకే ఆ ఆఫర్‌ను వైఎస్ జగన్ తిరస్కరించే అవకాశం లేకపోలేదంటున్నారు.. మరి జగన్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..