AP: కూటమికి షాక్ ఇచ్చిన సర్వే… ఏడాదికే ఇంత వ్యతిరేకతనా… బాబు రియాక్షన్ ఏంటో?

AP: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడాది కాలంలోనే కూటమి పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. తాజాగా మరో సర్వే కూడా కూటమికి షాకింగ్ విషయాలను తెలియజేసింది.హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐఐటియన్ల బృందం ‘మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్’ పేరిట నిర్వహించినట్లుగా చెబుతున్న ఈ సర్వే, రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం కూటమి ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడించారు.

ప్రముఖ సెఫాలజిస్ట్ డాక్టర్ జి. గంగాధర్, ఐఐటియన్ల బృందం వెల్లడించిన ఈ నివేదిక, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో, కూటమికి చెందిన 72 మంది ఎమ్మెల్యేలు నేరుగా వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా మరో 26 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏర్పడుతోందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా 98 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ప్రజల్లో పడిపోయిందని ఈ నివేదిక సారాంశం.

తెలుగుదేశం పార్టీలో 135 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఈ 135 మంది ఎమ్మెల్యేలలో 54 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తెలియజేశారు. అదేవిధంగా 22 ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు తీవ్ర నిరాశ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వే బయటపెట్టింది. ఇక జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనగా, మరో ముగ్గురిపై వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇక బిజెపి ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కూడా వ్యతిరేకత ఉన్నట్లు తెలియజేశారు.ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలలో నలుగురిపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండగా, ఒక ఎమ్మెల్యేపై వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇలా ఈ సర్వే ప్రకారం కూటమిపై ఏడాదికి ఈ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడటంతో వైసిపి నేతలు కార్యకర్తలు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సర్వే విషయాని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఎలాంటి సూచనలు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.