తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి 2020-21 సంవత్సరానికిగాను. అందర్నీ పాస్ చేసేస్తూ ఇటీవలే పరీక్షా ఫలితాల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సో, పదో తరగతి విద్యార్థులంతా తదుపరి తరగతులకు ప్రమోట్ అయిపోయారన్నమాట. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనే పదో తరగతి విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇంకెన్నాళ్ళు పదో తరగతి సబ్జెక్టులే చదువుతారు.? పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు. కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. అది కూడా విపక్షాల ఆందోళన, కోర్టు ఆక్షేపణ నేపథ్యంలోనే జరిగింది ఆ వాయిదా కూడా.
తాజాగా పదో తరగతి పరీక్షల విషయంలో కూడా విపక్షాల ఆందోళన, కోర్టు కేసుల నేపథ్యంలోనే ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జులైలో పరిస్థితిని సమీక్షించి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటారట. అంటే, పరీక్షలు ఎప్పటికి జరిగేను.? అప్పటిదాకా విద్యార్థుల మానసిక పరిస్థితి ఏంటి.? నిజానికి, ఇలాంటి విషయాలో్ల వైఎస్ జగన్, మానవీయ కోణంలోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఎందుకో.. ఈసారి వైఎస్ జగన్ ఒకింత భిన్నంగా వ్యవహరించాల్సి వస్తోంది. విద్యార్థుల్లో ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థుల మీద పెరుగుతున్న ఒత్తిడి కారణంగా, వారి తల్లిదండ్రులూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత గందరగోళం, ఇంత అలసత్వం, ఇంత బాధ్యతారాహిత్యం అవసరమా.? అన్న ప్రశ్న ప్రభుత్వం పైకి విపక్షాల నుంచి దూసుకొస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుని పరిగణలోకి తీసుకుని, వారికి పరీక్షలు నిర్వహించాలనే అనుకుంటున్నాం.. అన్నది మంత్రి ఆదిమూలపు సురేష్ వాదన. కరోనా మహమ్మారి అంటే ప్రాణాలతో చెలగాటం. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టడం సబబు కాదేమో.