మేడిపండు చూడు మేలిమై వుండు పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్లుగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయంటున్నారు.. ఇక్కడి రాజకీయాల్లో రోజుకో తీరు వార్తలు విరామం లేకుండా ప్రచారం అవుతున్నాయి.. ఇకపోతే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. ఇక్కడి నేతల మధ్య అంతర్యుద్ధం, ఆధిపత్య పోరు ఎప్పుడు తారాస్థాయికి చేరినట్టు కనపడుతోంది.. కాగా పూర్తిస్థాయి ఆధిపత్యం పొందిన వైసీపీ, సరికొత్త రాజకీయ ప్రయోగానికి ఈ జిల్లాను వేదిక చేసుకుంది. అయితే ఈ జిల్లాలో మాజీ మంత్రులు, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిలను పక్కన పెట్టి యువనేతలుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్‌రెడ్డిలకు అమాత్య పదవులు ఇచ్చింది వైసీపీ..
ఇలా ఏడాది గడిచేలోపే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేతల మధ్య అంతరాలు పెరిగిపోయాయి. అసమ్మతి మరింత రాజుకుంటోంది. అంతకుమించిన అసహనం మొదలైంది. ఆనం రాంనారాయణ రెడ్డి, వరుసబెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుండటమే అందుకు నిదర్శనం. అదీగాక ఒక దశలో ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.. అంతేకాకుండా గత పదిహేను నెలల నుంచి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు ఆనం రామనారాయణరెడ్డి. దీనికి కారణం తనకు మంత్రి పదవి దక్కకపోవడమే అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఆనం కు సమయం వచ్చేసిందంటున్నారు.. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికలో ఆనం కూడా కీలకంగా మారనున్నారట. ఇక వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమయింది.. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం కూడా ఉండటంతో వైసీపీ అధిష్టానానికి ఇప్పుడు ఆనంతో పెద్దపని పడిందట.. అందుకే ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నారట నేతలు అందుకే జగన్ పేషీ కి అర్జెంట్ గా రావలెను అనే కబురు పంపారట..