మొన్నటికి మొన్న యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై అభినందించడానికేనని బీజేపీ చెప్పుకున్నా, తెరవెనుకాల ‘కమ్మ’టి రాజకీయమైతే నడిచింది. బీజేపీ తరఫున ఎన్టీయార్ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తాడని కొందరు బీజేపీ నేతలు నమ్మకంతో చెబుతున్నారంటే, అంతలా జూనియర్ నందమూరి తారక రామారావుని అమిత్ షా ఒప్పించారనే అనుకోవాలి.
ఇక, తాజాగా అమిత్ షా తన తదుపరి హైద్రాబాద్ పర్యటనలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో హైద్రాబాద్ రానున్న అమిత్ షా, పనిలో పనిగా ఇదే పర్యటనలో ప్రభాస్‌తో భేటీ అవుతారట.
బీజేపీ నేత, మాజ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన దరిమిలా, ప్రభాస్‌ని ఓదార్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని బీజేపీ చెప్పుకోవచ్చుగాక. కానీ, అసలు కథ వేరే వుంది. అదే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మార్కు సినీ రాజకీయం.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, సినిమా గ్లామర్‌ని తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగించబోతోంది. మెజార్టీ సినీ ప్రముఖుల్ని తమ వలలో వేసుకుంటోంది బీజేపీ. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, సినీ నటుడు నితిన్‌లతో ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యాక, ఆ ఇద్దరూ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారంటూ బీజేపీ నేతలు ప్రకటించేసుకున్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీయార్ విషయంలో కాస్త గందరగోళం వుంది. ప్రభాస్ విషయానికొస్తే, కృష్ణంరాజు ఎలాగూ బీజేపీ నేతగానే పని చేశారు. సో, పెదనాన్న నుంచి నట వారసత్వాన్ని తీసుకున్న ప్రభాస్, రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.