చంద్రబాబు అపకీర్తి కిరీటంలో మరో స్టే

Amaravati Scam: Relief to Chandrababu as AP HC stays CID Probe

Amaravati Scam: Relief to Chandrababu as AP HC stays CID Probe

ఎపుడో ఇరవై ఏళ్ళక్రితం కాబోలు…ఒక ప్రసిద్ధ న్యాయవాది మాట్లాడుతూ “చంద్రబాబును ఎక్కడైనా ఓడించగలం కానీ కోర్టుల్లో మాత్రం ఓడించలేము” అని ఒక కొటేషన్ లాంటి సూక్తిని ఈ రాష్ట్రానికి అందించారు. అది అక్షరాలా సత్యం అని ఈరోజు మరోసారి హైకోర్టులో రుజువైంది. ఇప్పటికీ ఆయన మీద 21 స్టేలు ఉన్నాయంటారు. అవి ఎన్నైనా కావచ్చు…చంద్రబాబు ఏ విచారణను కూడా ధైర్యంగా ఎదుర్కొని తన శీలాన్ని పరీక్షకు పెట్టుకున్న ఉదంతం ఇంతవరకు లేదు.

తాజాగా అసైన్డ్ భూములను బలవంతంగా అమ్మించారని ఆరోపిస్తూ రాష్ట్ర సిఐడి కేసులు పెట్టి దానిలో నిందితులుగా చంద్రబాబు, నారాయణ, మరికొందరు మాజీ మంత్రులు, తెలుగుదేశం నాయకులను చేర్చి విచారణ మొదలు పెట్టింది. అందులో భాగంగా నారాయణను సోమవారం, చంద్రబాబును మంగళవారం విచారణకు హాజరై తమకు తెలిసిన వివరాలను అందించాలని ఆదేశించింది. అయితే చంద్రబాబు ఈ విచారణపై స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు చంద్రబాబు, నారాయణలపై విచారణకు బ్రేక్ వేసింది. అసలు కేసుని విచారించరాదని ఆదేశించింది.

ఇంకా పూర్తి వివరాలు బయటకు రాకపోయినప్పటికీ ప్రాధమికంగా లభిస్తున్న సమాచారం మేరకు ఈ కేసుపై చంద్రబాబు, నారాయణలకు కేవలం నాలుగు వారాల పాటు ఊరటను మాత్రమే ఇచ్చిందని అంటున్నారు. అలాగే ఈ కేసులో మిగతా ఏడుగురు నిందితులు కోర్టుకు వెళ్ళలేదు. మరి వారిపై విచారణ కొనసాగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. సిఐడి మాత్రం చంద్రబాబు హయాంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులను తమ ఆఫీసుకు పిలిపించి విచారణ జరుపుతున్నారు. ఇలాంటి దశలో కేసు మీద స్టే ఇవ్వడం అనేది విచారణపై ప్రభావం చూపించే అంశమే.

నిజానికి సిఐడి తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో దొరికిన ఆధారాలు చూపించమని న్యాయమూర్తి కోరగా పూర్తి ఆధారాలు తరువాత చూపిస్తామని చెప్పడంతో న్యాయమూర్తి అసంతృపి చెంది చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని చెబుతున్నారు. అయితే దర్యాప్తు సంస్థలు చేసే దర్యాప్తును అడ్డుకోవద్దని ఇటీవలనే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా హైకోర్టు కేసు విచారణపై స్టే విధించడం పట్ల రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారణ లో తమకు అన్యాయం జరిగిందని నిందితులు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు వారికి న్యాయం ప్రసాదించాలి తప్ప దర్యాప్తు సంస్థల మొరాలిటీని దెబ్బతీస్తూ విచారణ చేయరాదని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసుకు మూలకారకుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని అంటున్నారు. హైకోర్టు తాత్కాలిక స్టే మాత్రమే ఇచ్చిందని, కేసును కొట్టేయలేదని, తరువాతైనా ఆ స్టే వెకేట్ కావడానికి అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

ఏమైనప్పటికీ మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న చంద్రబాబుకు ఈ తీర్పు గొప్ప ప్రశాంతత కలిగించేదే. పార్టీ సర్వనాశనం అయినా ఆయన భయపడడు, ఎందుకంటే ఆ పార్టీ ఆయన పెట్టింది కాదు, పెంచింది కాదు. పార్టీ ఎటుబోయినా ఆయనకు పోయేదేమీ లేదు. తన చర్మం భద్రంగా ఉంటే అదే చాలు!

 

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు