జగన్ సర్కారుకి షాక్: చంద్రబాబుకి ఊరట.!

Chandrababu, Narayana

Chandrababu, Narayana

అమరావతి ల్యాండ్ స్కామ్‌కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికీ, మాజీ మంత్రి నారాయణకీ హైకోర్టులో ఊరట లభించింది. అదే సమయంలో జగన్ సర్కార్‌కి ఝలక్ తగిలింది. అమరావతిలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందన్నది వైసీపీ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో అధికార పార్టీ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయించింది. బాధిత దళితుల తరఫున తాను ఫిర్యాదు చేశానని ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెబుతున్నా, స్వయంగా దళితుల ఫిర్యాదుతో పెట్టాల్సిన ఎస్సీ ఎస్టీ కేసుని, ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పెట్టించడమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరిగింది. కాగా, ఏపీ సీఐడీ తమకు పంపిన నోటీసులపై క్వాష్ పిటిషన్ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేశారు చంద్రబాబు, నారాయణ.

ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన న్యాయస్థానం, ల్యాండ్ స్కామ్ విచారణ ఏ దశలో వుందని సీఐడీని ప్రశ్నించగా, ప్రాధమిక దశలో వుందని సీఐడీ నుంచి సమాధానం వచ్చింది. స్పష్టమైన ఆధారాలు వుంటే చెప్పాలనీ, ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏపీ సీఐడీ తరఫున వాదనల్లో పస లేకపోవడంతో, కేసు విచారణపై న్యాయస్థానం స్టే విధించింది. కాగా, ఆరేళ్ళ క్రితం జారీ చేసిన జీవోపై ఇప్పుడు కేసులేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. మరోపక్క, బాధిత దళిత రైతుల్లో కొందరు, తమకు జరిగిన అన్యాయంపై స్పందిస్తూ మీడియా ముందుకొస్తున్నారు.

మరికొందరు రైతులు మాత్రం, తమకు అన్యాయం జరగలేదనీ, స్వచ్ఛందంగానే భూములు అప్పటి ప్రభుత్వానికి ఇచ్చామని అంటున్నారు. ఇంతకీ, అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్‌కి సంబంధించి దోషులెవరు.? అసలు అక్కడ స్కామ్ జరిగిందా లేదా.? ఏమో, వేచి చూడాల్సిందే.