అల్లూరి విగ్రహం: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదేనా.?

రాజకీయం ఎందులో వుండదు.? అన్నింటిలోనూ రాజకీయం వుంటుంది. రాజకీయమే అలా తయారైంది మరి.! మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ రావడంలో రాజకీయం వుందా.? అంటే, ఎందుకు వుండకూడదు.? అన్న సమాధానం రావడం సహజమే.

మహనీయుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల నేపథ్యం.. దానికి తోడు, ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల నేపథ్యం.. వెరసి, భీమవరంలో ఇదివరకెన్నడూ లేనంత సందడిగా రాజకీయ వాతావరణం మారుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే వేదికపై కనిపిస్తారు. వైసీసీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి.. ఇలా వేదిక చాలా కలర్‌ఫుల్‌గా వుండబోతోంది.

భీమవరం, నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వుంటుంది. ఈ ప్రాంతంలో క్షత్రియ సామాజిక వర్గ ప్రభావం, కాపు సామాజిక వర్గం తాలూకు ప్రభావం చాలా చాలా ఎక్కువ. అందుకే, అత్యంత వ్యూహాత్మకంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ‘అతిథుల’ ఎంపిక జరిగిందనే వాదనా లేకపోలేదు.

పూర్తిగా అధికారిక కార్యక్రమమే అయినా, తెరవెనుక రాజకీయాలు నడుస్తాయ్.. రాజకీయ లబ్ది కోసం ఆయా పార్టీలు ప్రయత్నిస్తాయ్.. ప్రయత్నిస్తూనే వున్నాయ్ కూడా. ‘అబ్బే, ఇందులో రాజకీయం లేదు..’ అని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

2024 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకునేలా రాజకీయ వ్యూహం నడుస్తోందన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న విశ్లేషణల, ఊహాగానాల సారాంశం.