ఏదైనా పెద్ద సినిమా వస్తోంది అంటే బిజినెస్ లెక్కల మీద అందరికీ ఆసక్తి మొదలవుతుంది. హక్కుల్ని ఎవరు కొన్నారు, ఎంతకు కొన్నారు, మిగతా హీరోల రికార్డులు బద్ధలయ్యాయా లేదా అనే విషయాలను అభిమానులు ఎక్కువగా పట్టించుకుంటారు. ఒకరకంగా సినిమాకు హైప్ తెచ్చేది కూడ ఈ లెక్కలే. సినిమా పీఆర్ బృందాలు ఈ బిజినెస్ లెక్కల్ని పనిగట్టుకుని మరీ లీకుల రూపంలో బయటకు వదులుతూ ఉంటారు. అప్పుడే బిజినెస్ వర్గాల్లో కలకలం మొదలయ్యేది.
పెద్ద సినిమాలంటే కొనడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అలాగని భారీ మొత్తం చెల్లించేస్తారా అంటే లేదు. బేరసారాలు భారీగా జరుగుతుంటాయి. ఆ బేరాల్లో సినిమా మీదున్న క్రేజే ఫైనల్ ధరను నిర్ణయిస్తుంది. అందుకే సినిమా కోసం చాలామంది క్యూలో ఉన్నారని, పెద్ద మొత్తంలో చెల్లించడానికి రెడీగా ఉన్నారనే వాతావరణం క్రియేట్ అవ్వాలి. అది రావాలి అంటే బిజినెస్ లీక్స్ ఉండాల్సిందే. ప్రజెంట్ ‘పుష్ప’ విషయంలో ఇదే జరుగుతోంది. సినిమా ఓవర్సీస్ డీల్ భారీ ధరకు అమ్ముడైపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి ఈ హక్కులను రికార్డ్ రేటు చెల్లించి సొంతం చేసుకుందని అంటున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇదే బెస్ట్ డీల్ అని చెబుతున్నారు. అంతేకానీ ఆ రేటు ఎంతనేది మాత్రం చెప్పట్లేదు. అదే మ్యాజిక్ ఇక్కడ.అంకెలు బయటకురావు. కానీ హైప్ మాత్రం పెరిగిపోతుంటుంది. బన్నీ మార్కెట్, సక్సెస్ రేట్, సుకుమార్ క్రేజ్, ఈ లీకుల హడావుడి అన్నీ చూస్తుంటే సినిమా హక్కుల్ని భారీ ధరలకి విక్రయించేలానే ఉన్నారు.