తెలుగుదేశం పార్టీ ఘనంగా వర్చువల్ విధానంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించిన దరిమిలా, పార్టీ ముఖ్య నేతలు పార్టీ బాగు కోసం తమకు తోచిన రీతిలో అధినేతకు సూచనలిచ్చారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్నదానిపై చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా, టీడీపీని పైకి లేపేందుకు నానా తంటాలూ పడ్డారు. కరోనా నేపథ్యంలో ఇలా వర్చువల్ విధానంలో చేయాల్సి వచ్చిందిగానీ, లేదంటే ఆ హంగామా ఇంకో స్థాయిలో వుండేది. అయితే, అధికారం కోల్పోయి రెండేళ్ళవడంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదన్నది నిర్వివాదాంశం.
టీడీపీకి ప్రతిపక్షంలో వుండడం కొత్తేమీ కాదు. కానీ, అప్పట్లో చంద్రబాబు వెంట నాయకులు బలంగా నిలబడ్డారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. తెలంగాణ, ఆంధ్రపదేశ్.. రెండు చోట్లా పార్టీ పరిస్థితి దయనీయంగానే వుంది. ఇదిలా వుంటే, మహానాడు సందర్భంగా నారా లోకేష్ గురించిన చర్చ పెద్దగా జరగలేదు. ‘మా లోకేష్ బాబు దెబ్బకి జగన్ షాకవుతున్నారు..’ అని నిన్న మొన్నటిదాకా ప్రచారం చేసుకున్న తెలుగు తమ్ముళ్ళు అనూహ్యంగా సైలెంటయిపోవడం గమనార్హం. లోకేష్ వల్లనే పార్టీ భ్రష్టుపట్టిపోయిందని కొందరు నేతలు టీడీపీని వీడి వెలుతూ సంచలన ఆరోపణలు చేశారుగానీ.. కార్యకర్తలకు మాత్రం లోకేష్ మీద నమ్మకం బాగానే వుంది. ఇటీవలి కాలంలో లోకేష్ ప్రసంగాల్లోనూ మార్పు కనిపించింది. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ వ్యూహాలు బాగానే రచిస్తున్నా, కాలం కలిసి రావడంలేదు. దాంతో, తెలుగు తమ్ముళ్ళు లోకేష్ విషయంలో లైట్ తీసుకున్నారా.? అన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేతల హంగామానే మహానాడు సందర్భంగా ఎక్కువ కనిపించింది. వారెవరూ లోకేష్ గురించి పెద్దగా మాట్లాడింది లేకపోడంతో, కొత్త అనుమానాలకు తెరలేస్తోంది.