జగన్ సర్కార్ టీడీపీ యొక్క ఆర్థిక పునాదులను పెకలించే కార్యక్రమం చేపట్టిందా అంటే అవును అనే మాటలు వినిపిస్తున్నాయి. గీతం యూనివర్సిటీ విషయం తర్వాత టీడీపీలో మరో బిగ్ షాట్ ను టార్గెట్ చేసే అవకాశాలు వున్నాయి. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అను’కూల’మైన వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు అనేక లాభదాయకరమైన పనులు చేసిపెట్టాడు. వాటి మూలంగా ఆయా వ్యక్తులు, ఆయా సంస్థలు టీడీపీ కి అనుకూలంగా, అవసరానికి నిధులు ఇస్తూ ఆదుకోవటం లాంటివి చేస్తున్నాయి.
జగన్ సీఎం అయినా తర్వాత టీడీపీ యొక్క ఆర్థిక మూలాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఇందులో భాగంగా మొదటిగా నెల్లూరు నారాయణ, శిద్దా రాఘవరావు లాంటి నేతలను టీడీపీకి దూరం చేశాడు, ఇక ఆ తర్వాత కీలకమైన గీతం సంస్థలను టార్గెట్ చేసుకున్న వైసీపీ సర్కార్ గట్టిగానే తన పంజా రుచి చూపిస్తుంది. టీడీపీ హయాంలో అక్రమంగా కబ్జా చేసిన భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే పనిని మొదలుపెట్టాయి. పనిలో పనిగా గీతం మీద ఉన్న అనేక ఆరోపణలకు బయటకు తీసి, నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది వైసీపీ సర్కార్.
ఇక ఆ తర్వాత టీడీపీలో ఒకప్పుడు ఎంపీగా పనిచేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మురళీమోహన్ పై ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మురళీమోహన్ చంద్రబాబుకు బినామీగా అంటూ అనేక మంది చెపుతారు. అమరావతి రాజధాని కాకముందే మురళీమోహన్ తో చంద్రబాబు అక్కడ వేల ఎకరాలు కొనిపించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మురళీమోహన్ కూతురికి చెందిన అసోసియేషన్ కు 32 ఎకరాలను తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టాడని గతంలోనే జగన్ విమర్శించాడు.
“ఎకరం 50 లక్షల ఖరీదు చేసే ఈ భూమిని కేవలం 8 లక్షల రూపాయల చొప్పున 32 ఎకరాల్ని ఎంపీ మురళీమోహన్ కూతురుకు అప్పగిస్తుంటే అడిగే నాధుడు కూడా లేడు. ఇంతటి దారుణంగా దోచేస్తున్నారు. అందులో 65 మంది నిరుపేద రైతులు ఆ భూమిపై బతుకుతుంటే, వాళ్లందర్నీ తరిమేసే విధంగా కబ్జాదారులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ అండతో రెచ్చిపోతున్నారని 2018 లోనే ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఆరోపణలు చేశాడు.
ఇప్పుడు ఆ భూముల విలువ కోట్లలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీనితో వాటిపై వైసీపీ సర్కార్ ఫోకస్ పెట్టె అవకాశం లేకపోలేదు. ప్రతిపక్షములో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన జగన్, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాటిని నిరూపించవల్సిన బాధ్యత సీఎం జగన్ మీద ఉంది. ప్రతిపక్షములో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నకాని నిరూపించలేకపోతున్నాడు, దీనిని బట్టి చూస్తే జగన్ కేవలం కుట్రపూరితంగానే ఆరోపణలు చేశాడని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి మురళీమోహన్ కూతురి కి చెందిన అసోసియేషన్ మీద ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన ఆరోపణలను నిరూపించవల్సిన బాధ్యత ఉంది. మరి దీనిపై జగన్ దృష్టి పెడుతాడా లేదా అనేది చూడాలి…? ఒక వేళా సీఎం జగన్ దీనిపై ఫోకస్ చేస్తే, గత కొద్దీ రోజులుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న మురళీమోహన్ పేరు మరోసారి తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.