Adere Abhi: RGV మరీ ఇంత దిగజారిపోతాడనుకోలేదు: అదిరే అభి

Adere Abhi: యాక్టింగ్‌లో చిరంజీవి, మణిరత్నం, రామ్‌ గోపాల్ వర్మను చూసి ఇండస్ట్రీలో డైరెక్షన్ చేయాలనే కోరికతో వచ్చానని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అన్నారు. అంతటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి స్టేట్‌మంట్ చేస్తాడా ? ఇలా చేయడానికి ఇంతగా దిగజారిపోతాడా అని ఆయన ప్రశ్నించారు. ఈ పని అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. ఒక ఆర్టిస్ట్‌ను కించపరిస్తే నువ్వు ఫేమస్‌ అవుతావు అని ఆయన ఒకరితో చెప్పించడం తనకు బాధనిపించిందని అభి తెలిపారు. ఎందుకంటే ఆయనను నేను ఈ లెవల్‌లో చూడలేదని ఆయన అన్నారు.

అంతే కాకుండా రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సినిమా పాటర్న్ మారిపోయిందని, సినిమా ట్రెండ్ ఛేంజ్ అయిందని అభి అన్నారు. దౌడ్, రంగీలా లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో మార్పులు తెచ్చిన వ్యక్తి ఓ చిన్న పబ్లిసిటీ కోసం, ఆ మాట అనిపించడం తనకు నచ్చలేదని ఆయన చెప్పారు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా కూడా తాను ఇలానే రియాక్ట్ అవుతానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ బయట అలా రియాక్ట్ అవ్వకూడదేమో గానీ, తనకు అనిపించింది తాను చేశానని ఆయన అన్నారు. ఎందుకంటే ఆయన్ని ఓ రేంజ్‌లో ఊహించుకున్నానని, కానీ ఇంత దిగజారిపోయారేంటీ అని అనుకున్నానని ఆయన వివరించారు.

తనకు తెలియకుండా ఎలాంటి స్టేట్‌మెంట్స్ బయట పెట్టనని, రామ్ గోపాల్ వర్మ స్వయంగా తానే చెప్పించానని, ఇలా చేస్తే పబ్లిసిటీ వస్తుందని అని చెప్పడం వల్లే అలా తను మాట్లాడాల్సి వచ్చిందని అదిరే అభి చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్‌తో రంగీలా సినిమా తీసినపుడు బాలీవుడ్ అంతా ఊగిపోయిందన్న అభి, అలాంటి విలువలున్న ఆర్జీవీ గారు ఇలా చెప్పించారేంటీ అనేది మాత్రం ఊహించుకోలేకపోతున్నానని ఆయన తెలిపారు.