ఆకాశరామన్న పొలిటికల్ పంచాయతీ : అమరావతి రైతులకు న్యాయం జరిగేదెలా ?

Aakasa Ramanna political panchayati about Amaravathi farmers

వాది, ప్రతివాదులు: వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 

 
చంద్రబాబు : ఈరోజు గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్దమండి.  ఇది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని మనవి చేసుకుంటున్నా. 
 
వైఎస్ జగన్ : రాజ్యాంగ విరుద్దమైతే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండే గవర్నర్ బిల్లును ఎలా ఆమోదిస్తారు.  అంతా రాజ్యాంగం ప్రకారమే జరిగింది.  రాజ్యాంగంలో రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం.  గవర్నర్ న్యాయ సమీక్ష జరిపి మరీ ఆమోదం తెలిపారు.  ఇక మీరు ఎన్ని బుకాయించినా ఏం ప్రయోజనం లేదు.  
 
చంద్రబాబు : ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదు.  దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.  అమరావతి రైతుల తరపున మేం పోరాడతాం.  
 
పవన్ : నేను ముందే ప్రశ్నించాను.  భూములు సేకరించిన మీ పార్టీ అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏమిటి, అసలు రైతులకు రాజ్యాంగబద్దమైన హామీ ఉందా అని అడిగాను.  అప్పుడేమో అమరావతికి అడ్డంపడుతున్నానని నా మీద పడ్డారు.  ఇప్పుడేం సమాధానం చెబుతారు.
 
చంద్రబాబు : అమరావతి రాజధాని అంటే అప్పట్లో వైకాపా కూడా తలూపింది.  ఇప్పుడేమో మడమతిప్పింది.  మోసం చేసింది నేను కాదు వైఎస్ జగన్.  సమాధానమేదో ఆయనే చెప్పాలి.  అయినా అమరావతి విషయంలో మీకూ బాధ్యత ఉంది. 
 
పవన్ : బాద్యత ఉంది కాబట్టే ఆరోజు మిమల్ని రైతులకు గ్యారెంటీ ఏమిటని అడిగాను.  ఈరోజు రైతుల సంగతేమిటని జగన్ గారిని ప్రశ్నిస్తున్నాను.  ఆరోజు మీ నుండి సమాధానం రాలేదు.  ఈరోజు జగన్ గారి నుండి రావట్లేదు. 
 
వైఎస్ జగన్ : రాజధాని అనేది ఒక్క రైతులకు సంబంధించిన విషయం కాదు.  మొత్తం రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలు అందులో ముడిపడి ఉన్నాయ్.  అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాం. 
 
చంద్రబాబు : మరి ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా ఉంచమని, మూడు రాజధానులు తెస్తామని ఎందుకు చెప్పలేదు.  ఓట్లు పడవంనే కదా.  ఇది రాజకీయ కుట్ర కాదా అంటున్నాను. 
 
పవన్ : మీరు సీఎం అయ్యాక తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు.  అది చూసి రాజధాని ఆమరావతిలోనే ఉంటుందని, ఎక్కడికీ పోదని అంతా అనుకున్నారు.  చివరికి వేల ఎకరాలిచ్చిన రైతులకు అన్యాయమే జరిగింది.  దానికి మీ దగ్గర పరిష్కారం ఉందా. 
 
వైఎస్ జగన్ : భూములు సేకరించింది టీడీపీ హయాంలో.  మీ జనసేన కూడా ఆరోజు వారికి వంత పాడింది.  మీరిద్దరూ అప్పట్లో మిత్రులు.  ఇప్పుడు కూడా మీ మధ్యన రహస్య స్నేహం నడుస్తోంది.  రైతులకు మీరే సమాధానం చెప్పాలి.  
 
చంద్రబాబు : అవేం మాటలండీ.  రైతుల గురించి అడుగుతుంటే మా ఇద్దరి మధ్య స్నేహం నడుస్తోందని అసత్యపు ఆరోపణలు చేసి విషయాన్ని తప్పుదోవ పాటిస్తారేమిటి.  మీ దగ్గర సమాధానం లేదంటే మీరు తప్పు చేస్తున్నట్టే.  
 
పవన్ : ప్రభుత్వాన్ని నడిపిన ఆయన, నడుపుతున్న మీరు ఇద్దరూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం చూస్తే రైతులకు ఇప్పట్లో న్యాయం జరిగేలా కనిపించట్లేదు.  ఈ తప్పుకు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే.  
 
వైఎస్ జగన్ : మేము ఏ తప్పూ చేయలేదు.  రాజ్యాంగం ప్రకారమే పోతున్నాం.  మావైపు న్యాయం ఉంది కాబట్టే ఈరోజు గవర్నర్ ఆమోదం తెచ్చుకోగలిగాం.  తప్పు భూముల సేకరణ పేరుతో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన టీడీపీదే.  
 
చంద్రబాబు : మేము అవినీతికి పాల్పడ్డామనే ఆధారాలే ఉంటే ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు? కేవలం నేను మొదలుపెట్టిన రాజధాని పూర్తైతే పేరు మాకొస్తుందంనే పంతంతో అమరావతిని కాదని మూడు రాజధానులు అంటున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మీద న్యాయపోరాటం చేసి తీరుతాం.
 
ఆకాశరామన్న : ఏమిటయ్యా ఇది.  టీడీపీ, వైసీపీ..  మీ ఇరు పార్టీలు ఆడిన రాజకీయ క్రీడలో వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు బలైపోయారు. ఎంతసేపటికీ ఒకరి మీదొకరు నిందలు వేసుకోవడం తప్ప ఆశలు పెంచుకున్న రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా ఎవ్వరూ ప్రయత్నించట్లేదు.  రాజధాని ఎక్కడున్నా పాలన సరిగ్గా ఉంటే రాష్ట్రం బాగుంటుంది.  కాబట్టి రాజధాని ప్రాంతం సమస్య కాదు.  సమస్యల్లా తల్లి లాంటి భూములిచ్చిన రైతులదే.  
 
చంద్రబాబు చేసింది తప్పని మీరు భావిస్తే దానికి బలైన రైతులను ఆదుకోవాల్సిన బాద్యత ప్రస్తుత పాలకులుగా మీ మీద ఉంది జగన్ గారు.  కనుక ఆ దిశగా ఆలోచించి రైతులను ఆదుకోండి.  తాత్సారం చేసి వారిని బలిచేయకండి.  బాబుగారి మీద కోపంతో వారికి గనుక నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో వారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.  టీడీపీ, జనసేనలు కూడా ఊరికే ఆందోళలకు దిగకుండా చిత్తశుద్దితో పరిష్కార మార్గాలను వెతికి ప్రభుత్వం ముందు పెట్టడం మంచిది.