రేషన్‌కు ఆధార్‌ తో అనుసంధానం… ఆ నెంబర్ చెబితేనే సరుకులు !

All cardholders will get ration

మీ వద్ద ఆధార్ కార్డు ఉందా, అలాగే రేషన్ కార్డు కూడా కలిగి ఉన్నారా, అయితే మీరు ఈ పని ఖచ్చితంగా చేయాలి. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మాదిరిగానే మీ ఆధార్ నెంబర్‌ను, రేషన్ కార్డును అనుసంధానం చేసుకోవాలి.

ఇది తప్పనిసరి. ఇకపై కేవలం తమ రేషన్ కార్డు నెంబర్, బయోమెట్రిక్ అందిస్తే సరిపోదు.

ఇకపై రేషన్ సరుకులు పొందాలంటే మీ రేషన్ నంబర్ కచ్చితంగా ఆధార్ ‌తో అనుసంధానమై ఉండాల్సిందే. దానికి అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌ కు వచ్చే ఓటీపీ చెబితేనే రేషన్‌ డీలర్లు సరుకులు వినియోగదారులకు రేషన్ సరుకులు ఇస్తారు , లేకపోతె లేదు. ఈ మేరకు రేషన్ సరుకులు పొందేవారికి ఆధార్ ‌ను తప్పనిసరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం బయోమెట్రిక్‌, ఐరిస్‌ ద్వారా చౌకడిపోల్లో పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఆధార్‌ నంబర్‌ను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. వాస్తవానికి ఇందుకు సంబంధించి 2017 ఫిబ్రవరిలోనే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహార భద్రత కార్డుల ఆధారంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, వీటిలో 2.97 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఆధార్‌ కార్డులు లేని వారు తక్షణమే నమోదు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సూచించారు.