కన్నీటి పర్యంతమవుతూ ధ్రువతారకు కడసారి వీడ్కోలు.

తెలుగు సినీ తారాలోకంలో మరో ధృవ తార నేల రాలింది.తన సినిమాలతో కొన్ని తరాలను ఊర్రూతలూగించిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నటుడు సూపర్ స్టార్‌ కృష్ణను కడసారి చూసేందుకు నాలు మూలాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కడసారి వీడ్కోలు పలికారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబు తండ్రి చితికి నిప్పటించారు అగ్ని సంస్కారం నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరుపున పోలీసులు గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపి కృష్ణ పార్ధివ దేశానికి గన్ సెల్యూట్ చేశారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ తమిళ సై .. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

అటు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు. అటు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుటు నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణితో కలిసి కృష్ణ పార్దివ దేహానికి అంజలి ఘటించారు. అటు అల్లు అరవింద్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఇక కృష్ణ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. మొత్తంగా కృష్ణ మృతిపై దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక కృష్ణ లేరనే విషయాన్ని జీర్ణంచుకోలేకపోతున్న ఆయన అభిమానులు.. ఒక సందర్భంలో తన కుటుంబానికి గుడ్‌బై చెబుతున్న ఆయన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సూపర్ స్టార్‌కు వీడ్కోలు పలుకుతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణల శకం ముగిసింది. వారు మరణించినా.. వారి సినిమాలతో, జ్ఞాపకాలతో, చేసిన సేవలతో ఎప్పటికీ చిరస్మరణీయులుగానే ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకునే ఉంటారు. తెలుగువారి గుండెల్లో తనదైన నటనతో చెరగని ముద్రను వేసుకొని సుస్థిర స్థానం సంపాదించుకున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటు, శరీరంలోని కీలక అవయవాల వైఫల్యం (మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌)తో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్‌ చేసి ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. సోమవారం ఉదయం ఆరోగ్యం కాస్తా నిలకడగా ఉన్నప్పటికీ రెండు, మూడు గంటల తర్వాత ఆయన పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. అవయవాల పనితీరు మందగించింది. మెదడుకు రక్తస్రావం నిలిచిపోవడంతో పనితీరు ఆగిపోయి.. ఆ ప్రభావం మూత్రపిండాలు, ఊపిరితిత్తుల మీద పడింది. కిడ్నీల పనితీరును మెరుగుపరిచేందుకు డయాలసిస్‌ చేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.

సోమవారం రాత్రి 7 గంటల నుంచి ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందించ లేదు. గుండెపోటు, మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో కృష్ణ మృతిచెందినట్లు ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి పేర్కొన్నారు. చివరి క్షణాల్లో నొప్పి తాలూకు బాధ తెలియకుండా ఆయన మనశ్శాంతిగా కన్నుమూసినట్లు చెప్పారు. ఆయన కుమారుడు, సినీ హీరో మహేశ్‌బాబు, ఇతర కుటుంబసభ్యులు, కృష్ణ చివరి క్షణాల్లో ఆయన చెంతే ఉన్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ ఇకలేరన్న వార్త తెలిసి సినీరంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. పార్థివ దేహాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖుల్లో కొందరు కాంటినెంటల్‌ హాస్పిటల్‌కు తరలివెళ్లగా.. మరికొందరు నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి వచ్చారు. కృష్ణ మృతదేహాన్ని కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 12:08 గంటలకు అంబులెన్స్‌లో నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. అంబులెన్స్‌ లోపలికి వెళ్తున్న సమయంలో అభిమానులు ‘సూపర్‌స్టార్‌ కృష్ణ.. అమర్‌రహే’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం పద్మాలయా స్టూడియోకి తరలించారు. అనంతరం 12 గంటల నుండి అంతిమయాత్ర మొదలైంది. 3 నుండి 4.30 గంటల మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

ఒకే ఏడాదిలో ముగ్గురు: సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి చెందిన వారు ఒకే ఏడాదిలో ముగ్గురు చనిపోయారు. మహేశ్ సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. తాతని కడసారి చూసేందుకు వచ్చిన మనవడు గౌతమ్ కృష్ణ, మనవరాలు సితార వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఈ నేపథ్యంలో తన తాతను తల్చుకుంటూ సితార సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తాతతో దిగిన ఫొటోను నెటిజన్స్‌తో పంచుకుంది. ఒక్క రోజు తప్పకుండా మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని చెప్పింది. ”వీక్ డే లంచ్ మరెప్పుడు ఈ విధంగా ఉండదు. మీరు ఎన్నో విలువైన విషయాలను నాకు నేర్పించారు. ఎల్లప్పుడు నవ్వించారు. ప్రస్తుతం అవన్నీ నాకు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. మీరే నాకు హీరో. నేను ఒక్కరోజు తప్పకుండా మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా తాతగారు” అని సితార ఘట్టమనేని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

సూపర్ స్టార్‌ కృష్ణ మరణంతో యావత్ టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. కార్డియాక్ అరెస్టుతో చనిపోయిన ఆయన పార్థివ దేహాన్ని హాస్పిటల్‌ నుంచి నానక్ రామ్ గూడలోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత పద్మాలయ స్టూడియోని మార్చారు. చివరి సారి ఆయన్ని చూసేందుకు ఎంతోమంది అభిమానుల పద్మాలయకి వచ్చారు. అలాగే.. ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చిన ఆయనకి నివాళులు అర్పించారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమకి కృష్ణ గారు చేసిన సేవ ఎనలేనిది. మొదటి నుంచి ఆయన అన్ని ప్రయోగాలే చేశారు. మొదటి కలర్ సినిమా, మొదటి 70 ఎంఎం సినిమా వంటి ఎన్నో కొత్త పొకడలను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆయన మంచి సంకల్పంతో ముందుకు సాగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయనకి మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారితో మంచి స్నేహం ఉండేది. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు కలిసి పని చేశారు. వారిద్దరి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. వారిద్దరూ ఎప్పుడు నిర్మాత మంచి గురించే ఆలోచించేవారు. ఆ ఆలోచనని అందరూ నేర్చుకోవాలి. అలాగే కృష్ణగారు నటుడి, నిర్మాతగా, పద్మాలయ అధినేతగా చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయన మరణం ఆయన అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకి కూడా తీరని లోటు. ఒకే ఏడాది సోదరుడిని, తల్లిని, తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సోదరుడు మహేశ్‌కి, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ లేరనే విషయాన్ని మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఆయనతో అనుబంధాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఈయేడాది వరుసగా మహేష్ బాబుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. అన్న, అమ్మ కోల్పోయిన విషయాన్ని మరవక ముందే తండ్రి కృష్ణ మరణం మహేష్ బాబు కుటుంబాన్ని తీవ్రంగా కృంగదీసిందనే చెప్పాలి.

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఘట్టమనేని అభిమానులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్రంగా కలచివేసింది. మహేష్ కుమారుడు గౌతమ్, కూతురు సితార.. తమ తాత ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తాతతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గౌతమ్ కృష్ణ, సితార. ఈ సందర్భంగా తాతయ్య మృత దేహం వద్ద వీళ్లిద్దరు నివాళులు అర్పించారు. తన తాతయ్యను తలచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సితార. మరోవైపు గౌతమ్ కూడా తాతయ్యతో ఆడుకున్న జ్ఞాపకాలను తలుచుకొని భోరున విలపించారు. టాలీవుడ్ లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని కలచివేసింది. కృష్ణ తిరిగిరానిలోకాలకు వెళ్లారని తెలిసి ఆయన కోట్లాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ మరణం ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. కృష్ణ ఫ్యామిలీ కూడా మనం తరహాలో ఓ సినిమా చేయాలనుకున్నారు. ప్లానింగ్ కూడా చేశారు. కృష్ణ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆయనతో కలిసి నటించాలనే కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచివెళ్లారు కృష్ణ.

స్నేహశీలి, మృదు స్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన కృష్ణ కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు.

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.

తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’ ఫస్ట్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి తెలుగు సినిమా స్కోప్‌ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి తెలుగు 70ఎంఎం సినిమా ‘సింహాసనం’, తొలి ఓ.ఆర్‌.డబ్ల్యు రంగుల చిత్రం ‘గూడుపుఠాణి’, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, తొలి సినిమా స్కోప్‌ టెక్నో విజన్‌ చిత్రం ‘దొంగల దోపిడి’, తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ (తెలుగు వీర లేవరా..).. తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లోనే మోసగాళ్లకు మోసగాడు సినిమాతో ప్యాన్ వరల్డ్ మూవీతో అలరించారు. ఈయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమ ఓ ధృవతారను కోల్పోయిందనే చెప్పాలి.