కొడుకు పుట్టలేదని భార్యను అనుమానిస్తూ రెండో పెళ్లి చేసుకున్న భర్త

ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా కూడా కొంతమంది మూర్ఖుల ఆలోచనలు మాత్రం మారటం లేదు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని అంటారు కానీ కొంతమంది మూర్ఖులు వారసుల కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలో వారసుడు పుట్టకపోతే భార్యను చిత్రహింసలకు గురి చేయటం లేదా వారిని వదిలించుకొని రెండవ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల ఇటువంటి సంఘటన మోతె పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…హుస్సేనాబాద గ్రామానికి చెందిన మౌనికకు మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రైతు వాసుమేకల రామకృష్ణకు 2009లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మౌనిక తల్లిదండ్రులు ఎకరం 20 కుంటల భూమి, నాలుగు తులాల బంగారం, రూ.లక్ష నగదు వరకట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు కూతుర్లు పెద్ద పాపకు పది సంవత్సరాలు చిన్న పాపకు ఎనిమిది సంవత్సరాలు. ఇద్దరూ కూతుర్లు పుట్టడంతో రామకృష్ణ వారసుడి కోసం తరచూ భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అంతేకాకుండా ఆమెకు వివాహేతర సంబంధాలు అంటగడుతూ వేధించటంతో 13 నెలల క్రితం ఆమె పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఈ క్రమంలో మూడు నెలల క్రితం రామకృష్ణ మరొక మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. భర్త రెండవ వివాహం గురించి సమాచారం అందుకున్న మౌనిక మోతె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లభించలేదు. అందువల్ల మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదురుగా తన పిల్లలతో కలిసి ధర్నాకు దిగింది. తనకి తన పిల్లలకి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమని రోదించింది. దీంతో పెద్ద మనుషుల పంచాయతీలో న్యాయం చేస్తామని చెప్పడంతో నిన్న సాయంత్రం నాలుగు గంటలకు తన ఉద్యమాన్ని విరమించుకుంది.