ఆదిపురుష్ పై మండిపడుతున్న బాలీవుడ్ నటుడు

ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ టీజర్ రిలీజ్ అయినప్పటినుండి విమర్శకులకు గురవుతూనే ఉంది. ముఖ్యం గా అందులో సైఫ్ అలీ ఖాన్ లుక్ రావణుడిగా కంటే అల్లాఉద్దీన్ ఖిల్జీ లా ఉందని చాలా మంది ట్రోల్ చేసారు. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్‌తో సినిమాను చుట్టేసినట్టు కామెంట్స్  చేస్తున్నారు. వానర సేన కూడా గొరిల్లాలా కనిపిస్తున్నాయేంటంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ కూడా సైఫ్ అలీ ఖాన్ గెట్ అప్ తనకు నచ్చలేదని కామెంట్ చేసాడు. తాజాగా మహాభారతం లో భీష్ముడి పాత్రధారి, అలాగే శక్తిమాన్‌ పాత్రధారి ముఖేష్‌ఖన్నా ఘాటుగా స్పందించారు. రాముడు, కృష్ణుడు బాడీబిల్డర్లు కాదని విమర్శించారు.

తాజాగా ‘ఆది పురుష్‌’ టీజర్‌ను చూసిన  ‘శక్తిమాన్‌’ పాత్రధారి ముఖేష్‌ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ‘ఇటు రాముడు.. రాముడిగానూ, అటు హనుమాన్‌.. హనుమంతుడిగానూ కనిపించడం లేదు. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌లా ఉండరు.  రాముడు, కృష్ణుడిని చూడండి. వాళ్లేమీ బాడీ బిల్డర్స్‌ కాదు. వాళ్ల ముఖాలు సున్నితంగా, విధేయతతో ఉంటాయి. కోమలమైన సౌందర్యం కలిగి ఉంటారు తప్ప గడ్డాలు, మీసాలు కలిగి ఉండరు” అని కాస్త ఘాటూగానే స్పందించారు.

అలాగే ”సినిమాకు ‘ఆది పురుష్‌’ అని పెట్టారు. బాగానే ఉంది. ఆ పేరు పెట్టుకున్నప్పుడు రాతియుగపు మనిషి స్టోరీ చెప్పి ఉంటే బాగుండేది. కానీ, రామాయణాన్ని ఎంచుకుని, సినిమా చేయాలనుకుంటే పాత్రలు, వాటి ఆహార్యం మార్చాల్సింది. ప్రేక్షకుల విశ్వాసంతో మీరు ఆటలాడుతున్నారు. రూ.100 నుంచి రూ.1000కోట్లు పెట్టి, వీఎఫ్‌ఎక్స్‌తో చిత్రాన్ని తీస్తానంటే అది రామాయణం అయిపోదు. అది విలువలు, ప్రతిభలపై ఉంటుంది. ‘అవతార్‌’ను స్ఫూర్తిగా తీసుకుని, పాత్రలను తీర్చిదిద్దటం సరైంది కాదు.

ఈ విధంగా రామాయణ పాత్రలతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటే, ప్రజలు మిమ్మల్నే చూసి నవ్వటమే కాదు, వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఇదొక ఫిక్షనల్‌ స్టోరీ అంటూ మీరు చెప్పుకోవచ్చు. కానీ, దయచేసి రామాయణం అని మాత్రం చెప్పకండి. సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఇతిహాసాలను మార్చడానికి డబ్బులు వృథా చేయకండి. ఇతర మతాలతో ఇలాగే చేయగలరా” అని అంటూ ముఖేష్‌ఖన్నా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.