సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. కనీసం రెండు పెద్ద సినిమాలైనా విడుదలవుతాయి.`రెండు సినిమాలకు కనీసం వారం రోజులు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. సినిమాలు రెండూ బాగుంటేనే ఆడుతాయి. కొద్దిగా అటు ఇటు అయినా ఫ్లాప్ అవుతాయి. అలా రెండు సినిమాలకే పోటీ తీవ్రంగా ఉంటుంది. థియేటర్ల కౌంట్ సరిపోదు.
అలాంటిది ఒకేసారి మూడు పెద్ద సినిమాలు దిగితే పరిస్థితి ఏంటి. లాక్ డౌన్ మూలంగా ఈ ఏడాది రావాల్సిన చాలా సినిమాలు వాయిదాపడ్డాయి. ఇంకా అరకొర షూటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడే లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ రీస్టార్ట్ అవుతున్నాయి.
ఎంత త్వరగా షూటింగ్ చేసినా ఈ ఏడాదిలో సినిమాలు కంప్లీట్ అయ్యేలా కనబడట్లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తన ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని సంక్రాంతికి ఫిక్స్ చేశారు. ఈ ఏడాది రావాల్సిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సైతం ఈ ఏడాది వచ్చేలా లేదు. ఇంకో నెలన్నర షూట్, బోలెడంత పోస్ట్ ప్రొడక్షన్ మిగిలి ఉంది. అవన్నీ ముగిసి సినిమా విడుదలకు సిద్ధమవ్వాలి అంటే ఈ ఏడాది చివరకు కానీ కుదరదు.
అందుకే 2022 సంక్రాంతికి సినిమాను అనుకుంటున్నారట. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమేక్ సినిమా కూడ సగానికి పైగా మిగిలి ఉంది. దీన్ని కూడ సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు. మహేష్, పవన్ అంటేనే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ కూడ బరిలో ఉంటే సినిమా హాళ్లు చాలవు. మూడు చిత్రాలు గట్టెక్కాలంటే సంక్రాంతి సీజన్ కూడ సరిపోదు.