2021 బడ్జెట్ : ఎన్నికలు జరిగే ఆ 3 రాష్ట్రాలకే వరాలు !

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు‌‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించింది. వ‌చ్చే ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగ‌నున్న రాష్ట్రాలకు పెద్దపీట‌ వేసింది. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోం రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించింది.

ముఖ్యంగా తమిళనాడు, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల విష‌యంలో బడ్జెట్‌లో స్పష్టమైన మార్కును చూపించింది. తమిళనాడులో రోడ్ల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. లక్ష కోట్ల రూపాయ‌ల‌తో రోడ్ల అభివృద్ధితోపాటు లక్షా 18 వేల కి.మీ మేర రైల్వేలైన్ల అభివృద్ధికి కేటాయింపులు జరిపింది. అలాగే త‌మిళ‌నాడు బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసుల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు నిధులను సమకూర్చింది.

ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప‌శ్చిమ‌బెంగాల్‌పై సైతం కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. బెంగాల్‌లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధికి తాజా బడ్జెట్‌ లో నిధుల కేటాయింప జ‌రిపింది. అసోం, ప‌శ్చిమ‌బెంగాల్‌, కేరళలో ఐదు ప్రత్యేక జాతీయ ర‌హ‌దారుల‌ అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్న‌ది. దీనికి రూ.5 వేల కోట్లు వెచ్చించనుంది. అలాగే 11 వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్‌ నిర్మాణం చేపట్టనుంది.

కేరళకు సైతం నిధులు భాగానే వడ్డించింది. కొచ్చి మెట్రోరైలు ఫేజ్‌-2 అభివృద్ధికి రూ.1957 కోట్ల కేటాయింపులు జరిపింది. దాదాపు 65 వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది. అదేవిధంగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంపై కూడా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో‌ వరాల జల్లు కురిపించింది. అసోంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరిపింది