రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. గెలిచాక విర్ర వీగితే.. ఓటమి అత్యంత భయంకరంగా వుంటుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే, ఇంకో పదేళ్ళు రాష్ట్రంలో మరే ఇతర రాజకీయ పార్టీ కూడా వైఎస్సార్సపీకీ ఎదురు నిలబడే పరిస్థితి లేదు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతాయ్. ఓడలు బళ్ళవడం.. బళ్ళు ఓడలవడం.. రాజకీయాల్లో సర్వసాధారణం. అత్యద్భుతంగా రెండేళ్ళపాటు సంక్షేమ పాలన చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆశించిన మెజార్టీ ఎందుకు అందుకోలేకపోయింది.? ఈ ప్రశ్నపై అధికార పార్టీలో ఆత్మవిమర్శ జరగాలి. లోతైన చర్చ జరిగి, లోటుపాట్లను గుర్తెరిగినప్పుడే అది అధికార పార్టీకి ప్రయోజనం కలిగిస్తుంది. సంక్షేమం విషయంలో వైసీపీకి తిరుగు లేదు. కానీ, అభివృద్ధి మాటేమిటి.? నిజానికి, రెండేళ్ళ పాటన పూర్తి చేసుకోవడమంటే.. సంతోషపడాల్సిన సందర్భం మాత్రమే కాదు, రానున్న మూడేళ్ళ పాలన ఎలా.? అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఇకనుంచి ఈక్వేషన్స్ మారతాయి. పదవులపై ఆశలు పెట్టుకున్నవారు తమ ఆశలు నెరవేరకపోతే, వెన్నుపోటుకి సిద్ధమవుతారు. ఇంకోపక్క, సంక్షేమ సంబరాల్లో మునిగిప ప్రజలు, అభివృద్ధి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ప్రత్యేక హోదా ఏమైంది.? రాజధాని ఏమైంది.? స్టీల్ ప్లాంట్, పోర్టు.. ఇలా అన్ని అంశాలపైనా నిలదీతలు ఎదురవుతాయి. కరోనా బూచిని ఎక్కువకాలం చూపి, ప్రజల దృష్టిని ఎక్కువకాలం పక్కకు మళ్ళించలేదు ఏ ప్రభుత్వం అయినా. అసలు సిసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
తిరుపతి ఉప ఎన్నిక నిజానికి ఓ గుణపాఠం కిందే లెక్క. పార్టీలో ఎవరేం చేస్తున్నారు.? ప్రభుత్వంలో ఎవరేం చేస్తున్నారు.? అన్న విషయాలపై ఆరా తీయాల్సిన సందర్భమిది. రెండేళ్ళ క్రితం సాధించిన ఘనమైన విజయాన్ని చూసుకుని సంబరాలు చేసుకోవడం కాదు.. భవిష్యత్తు ఏంటన్న ముందస్తు ఆలోచన తప్పనిసరి.