రామజన్మ భూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి దేశవ్యాప్తంగా భారీగా విరాళాలు వస్తున్నాయి. ఇప్పటివరకూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల రూపంలో రూ.100 కోట్లు పొందింది అని ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ సంపత్ రాయ్ వెల్లడించారు. ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్న సమాచారం ఇంకా మా ప్రధాన కార్యాలయానికి చేరలేదు. అయితే , కార్యకర్తల నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ వారు రూ.100 కోట్లు విరాళాలు కలెక్ట్ చేసినట్లు తెలిసింది అని ఆయన చెప్పారు.
జనవరి 15న ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది ట్రస్ట్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి కనీసం రూ.10 విరాళాల రూపంలో పొందేలా కార్యక్రమాన్ని ప్రిపేర్ చేసింది. ఫిబ్రవరి 27 వరకూ ఈ సేకరణ ఉంటుంది. ఇలా అందరూ డబ్బు ఇవ్వడం ద్వారా ఆలయ నిర్మాణంలో అందరూ పాలు పంచుకున్నట్లు అవుతుందన్నది ట్రస్ట్ ఆలోచన.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ జన్మభూమి కేసులో సుప్రంకోర్టు తీర్పును అనుసరించి… 2021 నవంబర్ 9న కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ప్రస్తుతం విరాళాలు సేకరిస్తోంది. జనవరి 15న విశ్వహిందు పరిషత్ సారధ్యంలో ఓ బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ని కలిసి విరాళం కోరింది. ఆయన తన వ్యక్తిగత ఆదాయం నుంచి రూ.5,00,100 విరాళం ఇచ్చారు.