అయోద్య రామాలయం.! ఎందుకీ రాజకీయం.?

రాజకీయం అంటే, ఈ రోజుల్లో సర్వాంతర్యామి.! అయోధ్య రామ మందిర నిర్మాణంలోనూ రాజకీయం వుంది.! బాబ్రీ మసీదు కూల్చివేత, అయోధ్య రామ మందిర నిర్మాణం.. ఇదంతా పెద్ద కథ.

బీజేపీ గనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చి వుండకపోతే, అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది అసాధ్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. అయితే, రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ, కేవలం రాజకీయ కోణంలోనే చూస్తోంది. అదే అసలు సమస్య.

అయోద్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి పైకి కనిపిస్తున్న ‘ట్రస్టు’ వేరు, తెరవెనుకాల రాజకీయం వేరు. దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులకీ, వివిధ రంగాల్లోని ప్రముఖులకీ ప్రత్యేక ఆహ్వానాలు వెళుతున్నాయి.. ఈ నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి.

అయోధ్య పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, చాలామంది వీఐపీలు, వీవీఐపీలూ ఈ కార్యక్రమానికి హాజరువుతుండడమే అందుక్కారణం. అసలు, దేవాలయంలో దేవుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఎందుకు.? ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

మామూలుగా అయితే, ఏదన్నా ప్రముఖ దేవాలయం నిర్మితమైతే, సంబంధిత దేవాలయ అర్చకులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేద పండితులు తదితరులు ఈ తరహా కార్యక్రమాలకు హాజరువుతుంటారు. క్రతువులు నిర్వహిస్తుంటారు.

ఇక్కడా అలాంటివన్నీ సంప్రదాయ బద్ధంగానే జరుగుతున్నా, దీన్నొక రాజకీయ కార్యక్రమంగా ఎన్నికల ముందర మలిచే రాజకీయ ప్రయత్నమే ఆక్షేపణీయం.!