పూర్తిగా ఏడాది కాలం వుంటుందో లేదో తెలియని పదవి.. ఆ పదవిలో కూర్చున్న వ్యక్తిని తమవైపుకు తిప్పుకోవడానికి వంద కోట్లు ఎరచూపుతోందట భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీ ఎమ్మెల్యే, డబ్బులకి ప్రలోభపడి పదవి మారతాడని.. ఎవరైనా అనుకోగలరా.?
అధికార పార్టీలో వుంటే, ఏడాది కాలంలో ఎంతో కొంత వెనకేసుకునే అవకాశం వుండొచ్చు. కానీ, పార్టీ మారితే.. ఆ తర్వాత అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులు అనూహ్యంగా వుంటాయ్. ఈ విషయం ఆ ఎమ్మెల్యేకి ఎరవేసే పార్టీ తెలుసుకోకుండా వుంటుందా.?
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్.. ఈ మూడు పార్టీలకూ కీలకమే. అందుకే, మునుగోడు ఉప ఎన్నికని రాజకీయ రణరంగంగా మార్చేశాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు అత్యంత హేయంగా మారాయి. పద్ధెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారన్నది టీఆర్ఎస్ ఆరోపణ.
అమ్ముడుపోయే వ్యక్తి అయితే, గులాబీ పార్టీకే అమ్ముడుపోతాడు కదా.?ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి అవకాశం వుంటే, అసలు ఉప ఎన్నికలతోనే పని లేదు. లాగేసుకోవడం, పండగ చేసుకోవడం. గులాబీ పార్టీ గతంలో చేసింది అదే కదా.! కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరిపోయారో అందరికీ తెలిసిందే.
కానీ, వంద కోట్లు.. అన్న ఆరోపణలు అప్పట్లో రాలేదు. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయ్. ఈలోగా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు సాధించేదేంటి.? దానివల్ల బీజేపీకి లాభమేంటి.?