సాక్షి గొప్పలు.. జగన్‌కు తిప్పలు

Total confusion in Andhra BJP
సాక్షి దిన పత్రిక వైఎస్ జగన్‌ను ఎంతలా పొగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  జగన్ సీఎం అయ్యాక ఆయన చేసే ప్రతి పనిని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆకాశానికెత్తేస్తుంటుంది.  అలా చేయడంలో తప్పేమీ లేదు.  చాలాసార్లు ఆ పొడగ్తలు జగన్ ఇమేజ్ ను పెంచుతుంటాయి కూడ.  కానీ ఒక్కోసారి అవే గొప్పలు తిప్పలు తెచ్చి పెడుతుంటాయి.  తాజాగా అలాంటి విషయమే ఒకటి జరిగింది.  మొన్నటి రోజున నిండు గర్భిణిని డోలిలో ఆసుపత్రికి తీసుకెళ్ళిన వాలంటీర్ అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది.  నిజానికి అది చెప్పుకోవలసిన విషయమే.  వాలంటీర్ వ్యవస్థ ఎంత బాధ్యతగా పనిచేస్తుందో తెలియజేస్తుంది.
 
 
ఇదంతా ఒక కోణంలో జరిగిన బెనిఫిట్.  కానీ ఇంకో కోణంలో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.  గత వారం వైఎస్ జగన్ 1088 108, 104 అంబులెన్సులను స్టార్ట్ చేశారు.  రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర చికిత్స ఎదురైనా కూడ ఈ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు.  ఇకపై ఏ వ్యక్తీ ప్రాథమిక, అత్యసర చికిత్స కోసం తిప్పలు పడాల్సిన పని లేదని, రాష్ట్రంలో ఏ మూల నుండి సమాచారం అందించినా ఈ అంబులెన్సులు కుయ్ కుయ్ మంటూ వెళ్లి వైద్యం అందిస్తాయని వైకాపా నేతలు అన్నారు.  ఆ వాహనాలతో లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  
 
 
ఇంతలా గొప్పలు చెప్పిన తర్వాత విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన గర్భిణ  మహిళను వైద్యం కోసం 12 కిలోమీటర్ల అటవీ మార్గం గుండా వాలంటీర్ సాయంతో మోసుకుని తీసుకువెళ్లారని కథనం ప్రచురితమైంది.  ఇది చూసిన ప్రత్యర్థి వర్గాలు ఇలా సీఎం ప్రారంభించిన అంబులెన్సులు ఎమయ్యాయి.  ఇలా డోలి కట్టి తీసుకురావాల్సిన అగత్యం ఏమిటి.  రాష్ట్రంలో మూల మూలకు అంబులెన్సులు వెళతాయన్నారు.. కానీ ఏజెన్సీలోకి మాత్రం వెళ్లలేకపోయాయి.  అలాంటప్పుడు పథకం ప్రారంభించి ఏం లాభం, బహుశా అంబులెన్సు వాహనాలు ఇంకా ప్రచారంలో తిరుగుతూనే ఉన్నాయేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు.  మొత్తానికి మెచ్చుకోదగిన ఒక మంచి పని ఇంకో వైపు నుండి విమర్శలను ఎదుర్కోవడానికి కారణమైంది.