వైఎస్ జగన్ దాతృత్వం.. కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ వరం

దేశం మొత్తం కరోనా విలయతాండవంతో విలవిలలాడిపోతోంది.  పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసులను ఎలా డీల్ చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా సదుపాయాలు లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు వేలల్లో, లక్షల్లో ఉండటంతో ఆర్థిక స్థోమత లేని వారికి కరోనా చికిత్స గగనమైపోయింది.  కొన్ని రాష్ట్రాల్లో డబ్బున్న వారికి కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడంలేదు.  దీంతో ఏపీ సర్కార్ ఇకపై ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరోనా ట్రీట్మెంట్ ఇవ్వొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.  కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులను భరించే స్థోమత ఎంతమందికి ఉందనే ప్రశ్న ఉత్పన్నమైంది. 
 
 
దీంతో సీఎం జగన్ ఇంకో అడుగు ముందుకువేసి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  వైరస్ సోకి లేదా సోకిందనే అనుమానంతో వచ్చే ఎవరినైనా ప్రైవేట్ ఆసుపత్రులు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలని, అందుకుగాను ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, బ్లాకులు, బెడ్లు సిద్దం చేసుకోవాలని ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించింది.  అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం చెల్లించే మొత్తాన్ని కూడా నిర్ణయించి వివరాలను విడుదల చేసింది.  వైరస్ ప్రారంభ దశలో ఉన్నవారికి రోజుకు రూ. 3250 చెల్లిస్తామని పేర్కొంది. 
 
 
అలాగే వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ. 5480, ఐసీయూలో ఎన్ఐవీ పెడితే రోజుకు రూ. 5980, ఐసీయూలో వెంటిలేటర్ పెడితే రోజుకు రూ. 9580, వెంటిలేటర్ లేకుండా SEPSIS రోజుకు రూ. 6280, వెంటిలేటర్‌తో కూడిన SEPSIS రోజుకు రూ. 10,380 చెల్లిస్తామని తెలిపింది.  రేషన్  కార్డు లేకపోయినా కరోనా రోగులు కూడా ఆరోగ్యశ్రీ కిందకు వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు.  సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వైరస్ బారినపడిన అనేకమందికి చికిత్స గురించి మనోవేదన పడే పెద్ద ఆవస్థ తప్పింది.  పొరపాటున వైరస్ సోకినా కార్పొరేట్ వైద్యం అందుతుందనే ధైర్యం ప్రజలకు లభించింది.