వరుస ప్రమాదాలు విశాఖ వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎల్ జీ పాలిమర్స్ ఘటన అనంతరం మరో రెండు కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు విశాఖ వాసుల్ని మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నేటి రాంకీ ఫార్మా ఘటనతో మరింత ఆందోళన నెలకొంది. పరవాడ ఫార్మా చరిత్రలో రాంకీ ఫార్మా ఘటన పెద్దదని, రాష్ర్ట వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎల్ పాలిమర్స్ విస్ఫోటనం తర్వాత తాజా ఘటన మరోసాని అందరిలోనూ చర్చకు దారి తీసింది. అయితే ఇలా విశాఖలో చోటు చేసుకుంటోన్న వరుస ప్రమాదాల వెనుక రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని విశాఖ స్థానిక వైకాపా ఎమ్మెల్యే గుడివా అమరనాథ్ ఆరోపించారు.
వరుస ప్రమాదాలు జరుగుతోన్న తీరు చస్తుంటే పెద్ద కుట్ర జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. ఈ ఘటనలన్నింటిపై లోతైన విచారణ జరిపిస్తే దోషులెవరో? తెలుతుందన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేలా కొందరు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. విశాఖకు రాజధాని రాకుండా టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈనేపథ్యంలో అమరనాథ్ టీడీపీపై అనుమానం వ్యక్తం చేసారు. 2014లో అమరావతి కోసం భూములు ఇవ్వని రైతుల అరటి తోటలను టీడీపీ తగలబెట్టిందన్నారు. కానీ ఆనెపాన్ని వైసీపీపై నెట్టారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికే ఇలాంటి శవ రాజకీయాలు చేసే అలవాటుందని ఆరోపించారు. ఏ ప్రమాదం జరిగినా టీడీపీ నేతలు ప్రభుత్వంపై నిందలు మోపుతోన్న తీరు చస్తుంటే? అసలు ఈ ప్రమాదాలు అన్నింటికి ఆ పార్టీ నేతలే కారణమవుతున్నారని తమకు సందేహం కల్గుతుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జరిపించి వైసీపీ దోషుల్ని జైలుకి పంపించిందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ప్రమాదాల్లో ఒక్కరినైనా చంద్రబాబు జైలుకు పంపించారా? అని ప్రశ్నించారు. విశాఖ ఇమేజ్ ని దెబ్బ తీయాలని చూస్తే ఉపేక్షించేది లేదని అమరనాథ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.