మరో వైసీపీ ఎమ్మెల్యేకి, కీలక నేత మనవడికి కరోనా పాజిటివ్

ఏపీలో కూడా కరోనా తాకిడి ఎక్కువగానే ఉంది.  ఇప్పటివరకు 10,884 మందికి కరోనా సోకింది.  సామాన్య జనం మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా వైరస్ సోకుతుండటం చర్చనీయాంశమైంది.  ఈమధ్యే విజయనగరం జిల్లా ఎస్.కోట వైసీపీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ అని తేలింది.  దీంతో హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు.  సదరు ఎమ్మెల్యే గత అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో ఆయన ద్వారా వైసీపీలో ఇతర నేతలు ఎవరికైనా వైరస్ సోకి ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.  అందరూ మరోసారి టెస్టులు చేయించుకున్నారు. 
 
వీటిలో కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు పాజిటివ్ వచ్చింది.  లాక్ డౌన్ సడలింపుల అనంతం సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో ఆయనకు వైరస్ సోకి ఉంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది.  కానీ ఇతర ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలను గుర్తు తెచ్చుకుని కంగారుపడుతున్నారు.  ఇక మరొక కీలక నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది.  అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. 
 
అంతేకాదు ఆయన డ్రైవర్, అటెండర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట.  దీంతో సదరు లీడర్లను, వారి కుటుంబ సభ్యులను కలిసిన ఇతరుల్లో కంగారు నెలకొంది.  మరోవైపు ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,69,319 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 10,884 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  వీరిలో ప్రస్తుతం 5760 యాక్టివ్ కేసులున్నాయి.  ఇక మృతుల సంఖ్య చూస్తే 136కు చేరుకుంది.  సీఎం జగన్ రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వర్తించాలని, అనుమానితులందరికీ పరీక్షలు జరగాలని అధికారాలను ఆదేశించారు.