భారం రాష్ట్ర ప్రభుత్వాల నెత్తినే పెట్టనున్న మోదీ 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరగడమే తప్ప తగ్గుతున్న సూచనలు కనబడటంలేదు.  ప్రభుత్వం దాదాపు అన్నిటికీ వెసులుబాటు కల్పించడంతో రోజువారీ జీవితం సాధారణ స్థాయికే వచ్చింది.  ప్రజలు ఏం ప్రమాదం లేనట్టే రోడ్ల మీద తిరుగుతున్నారు.  దీంతో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.  ఇప్పటికే ఇండియాలో 3.32 లక్షల కేసులు నమోదవగా 9520 మంది మృత్యువాత పడ్డారు.  రోజుకు కనీసం 9000 పైచిలుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.  
 
లాక్ డౌన్ అనంతరమే ఇలా కేసులు పెరగడంతో లాక్ డౌన్ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని ల, సలు లాక్ డౌన్ కేసులు పెరిగేటప్పుడు కదా విధించాల్సింది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.  ఈరోజు ప్రధాని మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అనే సందేహం దేశ ప్రజల్లో నెలకొని ఉంది.  పలు మీడియా సంస్థలు కూడా లాక్ డౌన్ పొడిగింపు అంటూ కథానాలు ప్రసారం చేస్తున్నాయి. 
 
కానీ కేంద్రంలో అలాంటి వాతావరణమేదీ కనబడట్లేదు.  రాజకీయ వర్గాలు సైతం ఈసారి మోదీ లాక్ డౌన్ పొడిగించే సూచనలు లేవనే అంటున్నాయి.  కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేస్తారట ప్రధాని.  వాటిలో ముఖ్యంగా అన్ లాక్ నిబంధనలు అంటే భౌతిక దూరం, కర్ఫ్యూ లాంటి నిబంధనలను కఠినంగా అమలుచేయాలని సూచించవచ్చు.  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లను గుర్తించి అక్కడ లాక్ డౌన్ కఠినంగా అమలుచేసే వెసులుబాటు కల్పిస్తారు.  ఒకవేళ రాష్ట్రాలు కోరుకుంటే వారి ఇష్ట ప్రకారం ఇంకొన్ని రోజులు లాక్ డౌన్ విధించుకోవచ్చని కూడా ప్రధాని అనుమతులు ఇవ్వొచ్చు. 
 
వైరస్ విజృంభణ అధికంగా ఉన్న ముంబై, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, ఢిల్లీలలో డోర్ టూ డోర్ స్క్రీనింగ్ చేపట్టాలనే నిర్ణయం తీసుకోవచ్చు.  అంతేకాదు వైరస్ నిర్థారణ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలున్న నగరాల్లో టెస్టుల సంఖ్య పెంచాలని ఆయా ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించవచ్చు.  మొత్తం మీద ప్రధాని మోదీ ఈసారి బరువు, భాద్యతలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల నెత్తి మీదే పెట్టవచ్చు.  కాబట్టి ఈ దఫా లాక్ డౌన్ నిర్ణయం ముఖ్యమంత్రుల చేతుల్లోనే ఉంటాయి.