బెజవాడ గ్యాంగ్‌వార్‌కు పొలిటికల్ టచ్

 
 
 
బెజవాడలో జరిగిన గ్యాంగ్‌వార్‌తో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది.  బెజవాడలో ఒకప్పుడు ఈ గ్యాంగ్‌వార్స్ నడిచాయి కానీ ఈమధ్య అంతా ప్రశాంతంగానే ఉంది.  అలాంటిది ఒక్కసారిగా జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌తో సామాన్యులు షాకయ్యారు.  ఒకేసారి 30 మంది ఒక ఖాళీ స్థలంలో చేరి కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు.  మొదట ఇది కాలేజ్ కుర్రాళ్ల గొడవని అనుకున్నారు అందరూ.  కానీ కోట్లాటలో ఒక గ్యాంగ్ లీడర్ చికిత్స పొందుతూ నిన్న ఆదివారం మృతి చెందాడు. 
 
దీంతో పోలీసులు కూపీ లాగగా అసలు సంగతి బయటపడింది.  పెనమలూరులోని రెండు కోట్ల విలువైన ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ విషయంలో సెటిల్మెంట్ చేయడానికి సందీప్, మణికంఠ గ్రూపులు రంగంలోకి దిగాయి.  ఇద్దరూ ఎవరికివారు సెటిల్మెంట్ చేస్తామని పట్టుబట్టడంతో గొడవ పెద్దదై రాజీకి టైమ్, ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు.  కానీ రాజీ బెడిసింది.  రెండు గ్రూపులు బాహాబాహీకి దిగడంతో కోట్లాట జరిగి ఒక గ్రూప్ లీడర్ సందీప్ మరణించాడు.  ఇది పూర్తిగా రెండు గ్రూపుల మధ్య గొడవ.  కానీ వీటికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
ఒక వర్గం మీడియా మరణించిన సందీప్ టీడీపీకి చెందిన వ్యక్తని, మరొక గ్రూప్ లీడర్ మణికంఠ జనసేన వ్యక్తని చెబుతున్నాయి.  సాధారణంగా నేరం చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకి సానుభూతిపరుడే అయ్యుంటాడు.  అంతమాత్రానికే అతను చేసిన నేరాన్ని ఆ పార్టీకి అంటగట్టడంలో అర్థం లేదు.  ఇలా రౌడీయిజం చేయాలనుకునే వ్యక్తుల వెనుక లోకల్ రాజకీయ శక్తులు ఉండటం కామన్.  వీలైతే పోలీసులు, ప్రభుత్వం ఆ రాజకీయ శక్తులు కేసులో ఇన్వాల్వ్ అయి విచారణను నీరుగార్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ నేరంలో భాగస్వాములైన వారు పలానా పార్టీకి పనిచేసేవారంటూ గ్యాంగ్‌వార్‌లకు అనవసరంగా పొలిటికల్ టచ్ ఇవ్వడం సరైనది కాదు.