పైకి వెలుగులు.. లోపల చీకట్లు.. ఇది వైసీపీ పరిస్థితి 

వైసీపీ క్షేత్ర స్థాయిలో వెలిగిపోతున్నా కింది స్థాయిలో మాత్రం నలిగిపోతోంది.  ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు, లోకల్ లీడర్లు ఇకపై భారాన్ని మోయలేమని చేతులెత్తేసే పరిస్థితి.  కారణం నిర్లక్ష్యం.  అగ్ర నాయకత్వం గాలిలో విహరిస్తూ నేల మీదున్న పునాదుల్ని పూర్తిగా విస్మరించింది.  ఫలితంగా ప్రధానమైన క్యాడర్లో అసంతృప్తి తారా స్థాయికి చేరుకుంది.  ఎంతలా అంటే ఎవరికివారు సమావేశాలు పెట్టుకుని అధినేత వద్దే తేల్చుకోవాలని తీర్మానించుకుంటున్నారు.  కొసమెరుపు ఏమిటంటే ఈ అసంతృప్త వ్యక్తుల్లో ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా ఉండటం. 
 
వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం స్థానిక క్యాడర్లు.  అప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్న పార్టీలను కాదని అనేక మంది చిన్నా చితకా లీడర్లు తమ అనుచరులతో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల సహాయసహకారాలు లేకుండానే వీధి వీధికీ పార్టీ జెండాను మోస్తూ అహర్నిశలూ కష్టపడ్డారు.  పార్టీ గెలుపులో కీలక భాగస్వామ్యం వహించిన వీరంతా జగన్ సీఎం అయ్యాక తమకు, తమ అనుచరులకు న్యాయం జరుగుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు.  
 
కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా అధిష్టానం వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు.  వైఎస్ జగన్ ఎంతసేపూ మంత్రుల స్థాయి వరకే దృష్టి సారిస్తుండటంతో క్యాడర్లో అభద్రతా భావం చోటుచేసుకుంది.  భాద్యతగా చూసుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ యేడాదిలో సొంత మనుషులకు మేలు చేసే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పార్టీ కోసం కష్టపడినవారికి తగిన న్యాయం చేయలేదు.  అందుకు నిదర్శనమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల ఆవేదన.  
 
పశ్చిమం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెలంపల్లి శ్రీనివాసరావు మంత్రి పదవి అందుకున్నారు.  దీంతో అక్కడి స్థానిక నేతలు కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని అనుకున్నారు.  కానీ వారి ఆశలుఅడియాశలయ్యాయి.  మంత్రి తన అనుచరులు, బినామీలని తప్ప సామాన్య కార్యకర్తలను, నాయకుల్ని పట్టించుకోవడం లేదట.  కార్పొరేషన్ సీట్ల కేటాయింపులో కూడా తమకు మొండిచెయ్యే మిగిలిందని వారంతా వాపోతూ తమలాగే నిర్లక్ష్యానికి గురికాబడిన ఒక సీనియర్ నేత ఇంట్లో మీటింగ్ పెట్టుకుని తిరుగుబాటుకు సమాయత్తమవుతున్నారు.  
 
నెల్లూరులోని వెంకటగిరి, వినుకొండ, నరసాపురం నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి.  ఈ మూడు చోట్ల ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  పైకి కనిపించడంలేదు కానీ చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.  గెలుపు కోసం అహోరాత్రులు కష్టపడిన తమకు ఈ నిర్లక్ష్య వాతావరణంలో పార్టీ జెండాను మోయడం కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.  ఎప్పుడైనా వారంతా తిరగబడవచ్చు.  అదే జరిగితే పార్టీ పునాదులే కదిలిపోయే ప్రమాదం ఉంది.  పైస్థాయిలో జగన్ వేల కోట్లతో సంక్షేమ పథకాలు నడుపుతూ జనం ముందు వెలిగిపోతున్నా లోపల మాత్రం అసంతృప్తి చీకట్లు అలుముకుంటున్నాయి.  కాబట్టి ఇకనైనా అధినేత క్యాడర్ బాధలను పట్టించుకుంటే పార్టీకి మంచిది.