పుష్పశ్రీవాణిగారిని కవర్ చేయడానికి ఆమె భర్త విఫలయత్నం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు వాడీవేడిగా ఉన్నాయి.  కీలక నేతలు కొందరు ప్రభుత్వం పనితీరు పట్ల, అధికార పక్షం వ్యవహారశైలి మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.  కొందరు తమను, తమ నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని అంటే ఇంకొందరు ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.  వారంతా ఎమ్మెల్యే, ఎంపీలే.  ఇక డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామగారు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు అయితే తమ నియోజకవర్గం కురుపాంలో అభివృద్ది శూన్యమని, జగన్ పాలన కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనే భేష్ అన్నారు. 
 
దీంతో వ్యవహారం మరింత హీటెక్కింది.  వైఎస్ జగన్ ఇలా స్వపక్షంలోనే విపక్షం తయారవడం పట్ల తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట.  దీంతో మంత్రులు రంగంలోకి దిగారు.  నిన్న మంత్రి బాలినేని మాట్లాడుతూ సొంత పార్టీ నేతలే ఇలా మాట్లాడటం సరికాదని, ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలి కానీ మీడియా ముందు మాట్లాడటం ఏమిటని అదే మీడియా ముందు మండిపడ్డారు.  ఇక ఆరోపణల్లో ప్రత్యేకంగా కనబడిన డిప్యూటీ సీఎం మామగారు శత్రుచర్ల కామెంట్స్ మీద కౌంటర్లు కూడా మొదలయ్యాయి. 
 
ఆయన వ్యాఖ్యలపై వేరే నేతలు మాట్లాడితే అంత బలంగా ఉండదని అధిష్టానం అనుకుందో లేకపోతే కుటుంబం మూలంగా జరిగిన నష్టాన్ని కుటుంబం ద్వారానే రిపేర్ చేయాలని అనుకున్నారో క్లారిటీ లేదుకానీ నేరుగా శత్రుచర్ల కుమారుడు, పుష్పశ్రీవాణిగారి భర్త పరీక్షిత్ రాజు రంగంలోకి దిగారు.  ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి చంద్రశేఖరరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖడించారు.  ప్రతిపక్షం కూడా ప్రశ్నించలేని వాతావరణంలో సొంతవారే విమర్శలకు దిగడం తగదని, తన తండ్రి ఆరొపించినట్టు ఏమీ జరగడంలేదని అంటూ వివాదాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఎలాంటి అభివృద్ది జరిగిందో మాత్రం లెక్కలు చెప్పలేదు.  మొత్తానికి ఈ వ్యవహారంలో పుష్పశ్రీవాణిగారికి మామగారి విమర్శల ద్వారా జరిగిన నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది తప్ప ఆమె భర్త చేసిన డిఫెన్స్ పెద్దగా ఎలివేట్ కావట్లేదు.