పీవీ నరసింహరావు మీద కేసీఆర్ ప్రేమ.. పెద్ద స్కెచ్ ఉంది 

KCR love on PV Narasimha Rao
పీవీ నరసింహారావు.. దేశం గర్వించదగిన నేత, ఆర్థిక సంస్కరణలతో ఆర్థిక కష్టాలను నుండి దేశాన్ని గట్టెక్కించిన నేత.  గొప్ప దార్శనికుడు, అపర మేధావి.  ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పలు ఎన్నెన్నో.  కానీ దేశంలోని చాలా రాజకీయ పార్టీలకు ఆయన విధానాలు, వ్యవహర శైలి నచ్చేది కాదు.  ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ లోనే పీవీకి వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు.  అందుకే ఇన్నాళ్ళు ఆయన గొప్పతనాన్ని కొనియాడే పని మాటల వరకే పరిమితమైంది.  కానీ ఇప్పుడు ఉన్నట్టుండి కొన్ని రాజకీయ పార్టీలు పీవీవి లెగసీని సొంతం చేసుకునే పనిలో ఉన్నాయి.  వాటిలో కేంద్రంలో బీజెపీ, తెలంగాణలో తెరాస ముందున్నాయి.  
 
 
కేంద్రం సంగతి అటుంచితే రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నపళంగా పీవీ శతజయంతి వేడుకలను మొదలుపెట్టారు.  ఏకధాటిగా సంవత్సరం పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.  ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇలా కేసీఆర్ ఉన్నట్టుండి పీవీ పట్ల ఇంత శ్రద్ద కనబర్చడం వెనుక పెద్ద పథకమే ఉంది.  అందులో మొదటిది పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ.  ప్రధానిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి.  ఈ అంశం తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం.  ఈ విషయాన్నే క్యాష్ చేసుకోవాలనేది కేసీఆర్ ప్రయత్నం.  తెరాస తెలంగాణ సెంటిమెంట్ అనే పునాదుల మీద నిలబడిన పార్టీ.  ప్రజల్లోని ఆ భావోద్వేగమే ఆ పార్టీకి బలం. 
 
 
పీవీ కూడా తెలంగాణ వ్యక్తే కాబట్టి ఆ భావనను పైకి తెచ్చి, ఆయన ఖ్యాతిని మొత్తంగా తమవైపుకు తిప్పుకొని రాష్ట్రంలో తమ ఏకైక ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన.  అంతేకాదు కేసీఆర్ ఎంఐఎమ్ పార్టీకి మద్దతుదారు అని, ఆయన విధానాల్లో ఎంఐఎమ్ నేతల నిర్ణయం కీలకమని భాజపా ఆరోపిస్తూ ఉంటుంది.  అందుకే పీవీని ఓన్ చేసుకుని ఆ ఆరోపణ నుండి బయటపడాలనేది కేసీఆర్ ఐడియా.  ఎందుకంటే పీవీ నరసింహరావుగారు పక్తు సమైఖ్యవాది.  ఆయన నిర్ణయాలు ఎప్పుడూ సమఖ్య ధోరణిలోనే ఉండేవి.  అందుకే ఆయన్ను పక్కనబెట్టుకుంటే తన విధానాలలో మజ్లిస్ ప్రభావం ఉండదని చెప్పినట్టే అవుతుందని కేసీఆర్ ఆలోచన.