పవన్ జగన్‌ను పొగిడితే టీడీపీ గింజుకుంటోంది ఎందుకో !

రాజకీయాల్లో ఎదుటివారిని ఎలాంటి సందర్భంలో అయినా తిట్టడమే తప్ప పొగడటం అనే కాన్సెప్ట్ ఉండదు కొందరు దగ్గర.  అలాంటి వాటిలో టీడీపీ కూడా ఒకటి.  రాజకీయాలు అంటే ప్రత్యర్థులు చెడు చెసినా తిట్టాలి, మంచి చేసినా తిట్టాలి.  అప్పుడే ప్రతిపక్షంగా మన పని సంపూర్ణం అవుతుంది అనేది చాలా పార్టీల ఏకాభిప్రాయం.  కానీ జనసేన అలా కాదు.  పవన్ పంథా వేరు.  ప్రత్యర్థులు తప్పు చేస్తే విమర్శించాలి, మంచి చేస్తే అభినందించాలి అని ఎప్పుడూ అంటుంటారు పవన్.  అప్పుడే రాజకీయాలు ఆదర్శంగా ఉంటాయి.  అందుకే 108, 104 అంబులెన్సుల విషయంలో, కరోనా పై పోరాటంలో ఏపీ ప్రభుత్వ తీరును అభినందించారు ఆయన. 
 
ఇదే టీడీపీకి నచ్చడం లేదు.  పవన్ ఏంటి, జగన్‌ను పొగడటమేమిటి అంటూ నానా యాగీ చేస్తున్నారు.  అసలు కొందరైతే పవన్ జగన్‌తో రాజీపడిపోయారని విషయాన్ని తేల్చి పారేస్తున్నారు.  అదేమంటే మన సాంప్రదాయ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నడుమ యుద్దం తప్ప పొగడ్తలు, అభినందనలూ ఉండవు.  ఒకవేళ నిజంగా ప్రత్యర్థి మంచి చేసినా పొగడరాదు.  అలా పొగిడితే వారికి మంచి చేసినట్టు అవుతుంది.  అందుకే మంచి పనైనా లోపాలేమన్నా ఉన్నాయా అని వెతకాలి.  లోపాలు దొరక్కపోయినా విమర్శించాలి.  అప్పుడే మనకు మనుగడ ఉంటుంది అనేది వారి ఫార్ములా. 
 
ఆ ఫార్ములా ప్రకారమే అంబులెన్సుల కొనుగోలులో అవినీతి జరిగిందని, అది విజయసాయిరెడ్డి కేంద్రంగా జరిగిందని, జగన్ దానికి మద్దతని, అంబులెన్సులు స్టార్ట్ చేస్తే ఇన్ని కోట్లు పెట్టి పబ్లిసిటీ చేయాలా, ఇదంతా ప్రజాధనమే కదా, ప్రతి ప్రభుత్వ హయాంలో అంబులెన్సులు ప్రవేశపెట్టడం జరుగుతుంది.  ఇందులో కొత్తేముంది అన్నాయి.  కానీ పవన్ పొగిడేసరికి టీడీపీ విమర్శలకు గాలిపోయినంత పనైంది.  ఇక అంతే పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి వైకాపాకు భజన చేస్తున్నారని, ఎందుకంటే బీజేపీ, వైకాపాలు దోస్తులని చిత్రమైన కారణం చెబుతున్నారు.  చాలామంది జనం 1088 అంబులెన్సులను ఒకేసారి స్టార్ట్ చేయడం మంచి పనే కదా.  దాన్ని పవన్ పొగిడితే టీడీపీ శ్రేణులు ఇలా గింజుకుంటున్నాయి ఎందుకు అంటున్నారు.