నిర్లక్ష్యం వలన మరణించిన కరోనా రోగి.. సెల్ఫీ వీడియోలో నిజాలు 

హైదరాబాద్ నగరంలో కరోనా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.  వైరస్ సోకుతుందనే భయం కంటే సోకిన తర్వాత చేసే చికిత్స విషయంలోనే ప్రజలు ఎక్కువ ఆందోళనకు గురవుతున్నారు.  ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ దుర్భర పరిస్థితుల్లో ఉందనే ఆరోపణలు వస్తుండగా రోగులే నేరుగా చికిత్స ఎలా జరుగుతుందో వివరిస్తుండటం కలకలం రేపుతోంది.  కొద్దిరోజుల క్రితం వైరస్ సోకి మరణించిన జర్నలిస్ట్ చనిపోయే ముందు జరిపిన వాట్సాప్ మేసేజెస్ నందు గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలు అద్వానంగా ఉన్నాయని, అస్సలు పట్టించుకునే వారే లేరని వాపోతూ మరణించారు.  దీంతో గాంధీ ఆసుపత్రి డొల్లతనం బయటపడింది. 
 
ప్రభుత్వం తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు కురిశాయి.  అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.  తాజాగా మరొక కరోనా బాధితుడు కూడా వైద్యుల నిర్లక్ష్యం, సౌకర్యాల కొరతతో కన్నుమూశాడు.  చనిపోయే ముందు కొన ఊపిరితో కొట్టుకుంటూ తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా తండ్రికి పంపి ఆ తర్వాత కొద్దిసేపటికే కన్నుమూశాడు.  నగరంలోని బీజేఆర్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాడు.  మూడు గంటలు బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్‌ పెట్టడంలేదని, ఊపిరి ఆడటం లేదన్నా వినకుండా వెంటిలేటర్ పీకేశారని, గుండె ఆగిపోతోందని, ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుందంటూ రోగి వాపోయాడు.  గుండె ఆగిపోయింది, ఊపిరి ఒక్కటే కొట్టుకుంటోంది.. బాయ్ డాడీ.. అందరికీ బాయ్ డాడీ అంటూ కాసేపటికి మరణించాడు. 
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు వైద్యుల నిర్లక్ష్యం, సరైన సౌకర్యాలు కల్పించని ప్రభుత్వ వైఫల్యం మూలంగానే ఆ రోగి మరణించాడని తిట్టి పోస్తున్నారు.  బాధిత కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు.  ఒకవైపు కేసీఆర్ కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం అన్ని విధాలా సమర్థవంతంగా కృషి చేస్తోందని అంటుంటే మరోవైపు కుప్పలుగా కేసులు, మరణాలు, సౌకర్యాల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నాయి.