డా.సుధాకర్ విషయంలో చివరికి ఫూల్స్ అయింది జనమేగా 

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం రాష్ట్రంలో ఎంత రగడ సృష్టించిందో అందరికీ తెలుసు.  రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంలో వాదనలు, ప్రతివాదనలు చేసుకుంటూ చూస్తున్న ప్రజల్ని అయోమయానికి గురిచేశాయి.  సుధాకర్ అయితే ప్రభుత్వం తనను హింసిస్తోందని, చంపేస్తారనే భయంగా ఉందని నానా యాగీ చేశారు.  ఆయన తల్లి సైతం బయటికొచ్చి స్లో పాయిజన్ ఇచ్చి తన కుమారుడిని చంపుతున్నారని హెబియస్ కార్పస్ కేసు పెట్టి కోర్టు ద్వారా కుమారుడ్ని బయటకు తీసుకోచ్చుకున్నారు.  
 
ప్రతిపక్షం టీడీపీ అయితే ప్రభుత్వం మాస్కులు అడిగిన వైద్యుడిపై కక్ష కట్టిందని పెద్ద రగడ చేసింది.  ప్రజల్లో చాలా మంది అలాగే అనుకున్నారు.  సోషల్ మీడియాలో సుధాకర్ కు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు.  అతనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఒక వైద్యుడిని పిచ్చివాడిని చేస్తారా అంటూ విమర్శించారు.  పోలీసుల్నీ తప్పుబట్టారు.  మొత్తానికి సుధాకర్ వైపే న్యాన్యా ఉందని అనుకున్నారు.  ఇంకొందరైతే ఇదంతా టీడీపీ చేస్తోందని, వారి స్వార్థం కోసం ఒక వైడ్యుడిని ఇలా వాడుకుంటారా అంటూ సుధాకర్ మీదే జాలిపడ్డారు.  సీబీఐ కూడా కేసులో ఇన్వాల్వ్ అయింది.  
 
కానీ చివరకు సుధాకర్ సీఎం జగన్ తనకు దేవుడని అనేశారు, టీడీపీ తనను వాడుకోలేదని, తాను వారి కార్యకర్తను కాదని అనేశారు.  ఆరోజు పెయిడ్ గూండాలు తనను రెచ్చగొట్టాయని, వారే చొక్కా చింపి కొట్టారని, అప్పుడే పోలీసుల వచ్చి సేవ్ చేశారని అంతేగానీ పోలీసులు తనను కొట్టలేదని స్టేట్మెంట్ ఇచ్చారు.  దీంతో ఆరోజు ఛానెళ్ళలో చూసింది గ్రాఫిక్స్ కాదు కదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  అయన జగన్ తనకు దేవుడని, ఆయన క్షమించి తన ఉద్యోగం తనకు ఇప్పిస్తే బుద్దిగా పనిచేసుకుంటానని, తనకు టీడీపీతో పరిచయం కూడా లేదని అంటున్నారు. 
 
జీతం లేకపోతే బ్రతకడమెలా అంటూనే తనకు తాతల ఆస్థి వందల వేల ఎకరాలు ఉందని పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు.  ఆయన మాటలు వింటే తెర వెనుక ఏవో శక్తులు గట్టిగానే పనిచేశాయని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.  కానీ ఆయనిచ్చిన వాగ్మూలం నేపథ్యంలో ఎవరినీ తప్పుబట్టలేని పరిస్థితి.  మొత్తానికి సుధాకర్ వ్యవహారం ద్వారా ఇకపై ఇలాంటి పంచాయితీలను పట్టించుకోకపోవడమే ఉత్తమం అనుకుంటున్నారు ప్రజానీకం.  ఈ అభిప్రాయంతో రేపు నిజంగానే ఎవరికైనా ఇలాంటి కష్టం వస్తే జనం చూసీచూడనట్టు వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు.