గత రెండు వారాలుగా విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో డాక్టర్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దూషించారని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన తీరు మరీ అభ్యంతరకరంగా ఉండటంతో పోలీసులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా ఉద్యోగం నుండి తొలగించి అరెస్ట్ చేసి వేధిస్తున్నారని సుధాకర్ ఆరోపించారు.
అరెస్ట్ అనంతరం ఆయన మానసిక స్థితి సరిగా లేదని మానసిక వైద్యశాలకు తరలించి అక్కడే పోలీసుల కాపలాతో నిర్భందించారు. ఆ తరవాత సుధాకర్ తల్లి తన కొడుకుకు స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆరోపణలు చేయడం, సీబీఐ రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ఇంతలో సుధాకర్ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు సుధాకర్ పోలీస్ కస్టడీలో ఉన్నారా లేకపోతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారా అని ప్రశ్నించగా ప్రభుత్వం తరపు న్యాయవాది వివరణ ఇవ్వలేకపోయారు.
దీంతో కోర్టు సుధాకర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు హాస్పిటల్ సూపరింటెంట్ కు తెలిపి డిశ్చార్జ్ కావొచ్చని, కానీ సీబీఐ విచారణ కొనసాగుతుందని, విచారణకు సహకరించాలని తీర్పు వెలువరించింది. మరోవైపు సీబీఐ పోలీసులు, సుధాకర్ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. ఆ విచారణలో వెల్లడయ్యే విషయాల ద్వారానే నిజంగా సుధాకర్ తప్పు చేశారా లేకపోతే ఇది ఆయనపై జరిగిన కక్షపూరిత చర్యనా అనేది తేలనుంది.