టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ మెడకు మరో ఉచ్చు.. ఈసారి మరింత గట్టిగా  

ఒకప్పుడు డిజిటల్ మీడియా రంగంలో అగ్రగామిగా వెలుగొందిన టీవీ 9 న్యూస్ ఛానెల్ కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది.  తన కృషితో టీవీ 9ను టాప్ స్థానంలో నిలబెట్టిన రవి ప్రకాష్ చుట్టూనే ఆ వివాదాలన్నీ ఉంటుండటం గమనార్హం.  ఇప్పటికే సీఈవో పదవి నుండి దిగిపోయి మాజీగా మిగిలిన రవి ప్రకాష్ మీద చాలానే కేసులు పెట్టింది కొత్త యాజమాన్యం.  తాజాగా ఆయన మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది.  రవిప్రకాష్‌తో పాటూ మరో ఇద్దరు అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా తీశారని రుజువులు లభించడంతో ఈడీ కేసు నమోదు చేసింది.  
 
గతంలోనే దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గతేడాది అక్టోబర్‌లో ద పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.  ఈ కేసు ఆధారంగానే తాజాగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది.  ఈ మేరకు రవి ప్రకాష్ కు సమన్లు కూడా జారీ అయ్యాయి.  ఎసీబీకి సాంబంధించి రూ. 18 కోట్ల స్కాంలో గతంలోనే రవిప్రకాష్ అరెస్ట్ కాబడి బెయిల్ మీద బయటికొచ్చారు.  ఆయన మీద ఫోర్జరీ కేసు కూడా నమోదయి ఉంది.  ఆ ఫోర్జరీ సంతకాలతోనే నిధుల మళ్లింపు, నిధుల దుర్వినియోగం జరిగాయనేది అభియోగం.  
 
ఆయనతో పాటు ఇంకో ఇద్దరి మీద కూడా ఈ కేసు నమోదైంది.  ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లకు తెలీకుండా, బోర్డ్ మీటింగ్ పెట్టకుండా అక్రమంగా విత్ డ్రా చేసిన ఈ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయమై ఈడీ కూపీ లాగనుంది.  ఈ విచారణలో డబ్బు నిబంధనలకి విరుద్దంగా ఖర్చు కాబడిందని తేలితే మాత్రం రవి ప్రకాష్ మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయం.  ఒకప్పుడు టీవీ 9 సీవీవోగా ఒక వెలుగు వెలిగిన రవి ప్రకాష్ ఇప్పుడు అదే సంస్థ యాజమాన్యం పెడుతున్న వరుస కేసులతో సతమతమవుతుండటం చూస్తే ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.