ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అది కూడా భారీ కుంభకోణాలు, హత్య కేసులు, నిర్భయ యాక్ట్ లాంటి బలమైన కేసుల్లో కావడం గమనార్హం. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ లాంటి నేతలు అరెస్టయి జైల్లో ఉండగా అయ్యన్నపాత్రుడు మీద నిర్భయ కేసు బుక్కైంది. అలాగే యమనమల మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఇక తాజాగా మరొక నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై హత్య కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కాబడ్డారు. ఆ కేసులో మోకా బంధువులు ఇచ్చిన పిర్యాధులో అనుమానితుడిగా కొల్లు రవీంద్ర పేరు కూడా ఉంది.
దీంతో కొల్లును విచారించడానికి నిన్న పొలీసులు ఆయన ఇంటికి, ఆఫీసుకు వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్య సీతారాంపురం వద్ద జాతీయ రహదారిపై రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీలో మరోసారి అలజడి మొదలైంది. ప్రాథమికంగా కొల్లును విచారించకుండానే ఇలా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్యేనని విరుచుకుపడుతున్నారు. కావాలనే హత్య కేసును బీసీ నాయకుడైన కొల్లు రవీంద్ర మెడకు చుట్టారని, ఇది బీసీ నేతల అణగదొక్కే కుట్రేనని ఆరోపిస్తున్నారు.
అయినా ఒక మాజీ మంత్రిని ఇలా ప్రాథమిక విచారణ లేకుండా అరెస్ట్ చేయడం, హత్య జరిగిన రోజున బయటకురాని రవీంద్ర పేరు రెండు రోజుల తరవాత ఇలా ప్రధానంగా బయటకు రావడం, పోలీసులు ఉన్నపళంగా అరెస్ట్ చేయడం లాంటివి చూస్తే పలు అనుమానాలకి తావిస్తోంది. వాటికి తోడు టీడీపీ నేతలు బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారనే కొత్త కోణం తీసి గత అరెస్టులతో కలిపి విమర్శలు చేస్తుండటంతో అధికారుల నుండి పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది.