జెండా ఊపిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన 108 అంబులెన్సులు 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే ఎంతో ప్రతిష్టాత్మకంగా 108, 104 సేవలను ప్రారంభించారు.  కొత్తగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్సులని సీఎం విజయవాడలోని బెంజి సర్కిల్ నుండి ప్రారంభించారు.  అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఎవరి ప్రాణాలు పోకూడదనే లక్ష్యంతో ఈ సేవలను స్టార్ట్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంలో ఇదొక సువర్ణ ఘట్టమని అంతా కొనియాడారు. 
 
నిజమే.. ఈ స్థాయిలో ఒకేసారి 108, 104 సేవలు ప్రారంభం కావడం అనేది ప్రజలకు అత్యవసర వైద్యాన్ని దగ్గర చేయడమే అవుతుంది.   అంతా బాగానే ఉంది కానీ భారీ ఖర్చుతో, హంగులతో అట్టహాసంగా మొదలైన ఈ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.  నాలుగు వరుసల్లో నిలబెట్టిన 1088 అంబులెన్సులన్నీ ఒక్కసారి ప్రారంభం కావడంతో కొద్దిసేపటికే డ్రైవర్లలో గందరగోళం నెలకొంది.  ర్యాలీలో ఎక్కడ మొదలై ఎక్కడ ఆగాలి అనే విషయమై క్లారిటీ లేకపోవడంతో మద్యలో అంబులెన్సులు కొన్నిచోట్ల ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.  ఈ ఘటనలో సిబ్బందికి ఎవరికీ గాయాలు కాలేదు కానీ కొత్త అంబులెన్సులు కొన్ని ముందు వెనుక బాగా దెబ్బతిన్నాయి.  
 
సుమారు 7 వాహనాలకు గట్టి డ్యామేజ్ జరిగినట్టు ఫొటోల్లో తెలుస్తోంది.  ఇంత గొప్పగా మొదలైన మంచి కార్యక్రమంలో ఇలా అపశృతి చోటుచేసుకోవడంతో వైసీపీ శ్రేణులు అప్సెట్ కాగా టీడీపీ శ్రేణులు దొరికిందే తడవు అన్నట్టు విమర్శలకు దిగుతున్నారు.  ఇప్పటికే ఈ అంబులెన్సుల విషయంలో విజయసాయిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని వాదిస్తున్న తెలుగుదేశం ర్యాలీలో వాహనాలు 30 కి.మీ వేగంతో కూడా వెళ్లలేదు, కానీ ఒకదానికి ఒకటికి తగలగానే ఏదో 70, 80 స్పీడులో వెళితే డ్యామేజ్ అయినట్టు అయ్యాయి, అంటే కోట్లు వెచ్చించి మన్నిక లేని వాహనాలు కొనుగోలు చేశారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.