ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మంచి వేడి మీదున్నాయి. టీడీపీ హయాంలో జరిగిన పలు అవినీతి అంశాల మీద విచారణ చేపట్టిన జగన్ సర్కార్ అరెస్టులు మొదలుపెట్టింది. ఈరోజు ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని, కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నవారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం అంటోంది.
పలువురు వైసీపీ నేతల మాటల్ని బట్టి అరెస్టులు ఇంకా కొనసాగుతాయని అనిపిస్తోంది. సర్కార్ లిస్టులో గతంలో టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన పలువురు కీలక నేతలు ఉన్నారట. వారిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావ్ కూడా ఉన్నారట. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ నుండి 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని నేరుగా అంగీకరించిన ఆయన అందులో తప్పేముందని వాదించారు కూడ. ఈ వివాదం అప్పట్లో అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి తలనొప్పి తెచ్చింది.
ఇప్పుడు ఈ వ్యవహారంలోనే ప్రత్తిపాటిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి ప్రత్తిపాటి పుల్లారావ్ నేరుగా అధికార పార్టీ ఎంపీనే ఆశ్రయించారని వార్తలొస్తున్నాయి. ఈరోజు ఉదయం పుల్లారావ్ నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును కలిసి వైసీపీలోకి వస్తాను, తన జోలికి రావద్దని అడిగినట్టు రాజకీయ వర్గాల టాక్. అయితే ఆయన వైసీపీలోకి రావడం చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీకి ఏమాత్రం ఇష్టం లేదని, ఆమె ససేమిరా ఒప్పుకోలేదట. దీంతో ప్రత్తిపాటికి తిప్పలు తప్పవని అనుకుంటున్నారు.