గోదారమ్మను కొండపోచమ్మ చెంతకు చేర్చిన అపర భగీరథుడు కేసీఆర్

 

గోదారమ్మను కొండపోచమ్మ చెంతకు చేర్చిన అపర భగీరథుడు కేసీఆర్
 
తెలంగాణ ఏర్పడటంలోని ప్రధాన లక్ష్యాల్లో నీటి ప్రయోజనాలను సాధించుకోవడం కూడా ఒకటి.  ఈ లక్ష్యాన్ని కేసీఆర్ దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిన ఆయన దశలవారీగా చేసుకుంటూ వస్తున్నారు.  ఇక ఈరోజు ప్రాజెక్ట్ మొత్తంలో కీలకమైన అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించారు కేసీఆర్.  గోదావరి జలాలను అత్యధిక ఎత్తుకు తీసుకెళుతూ నిర్మించిన ఈ ప్రాజెక్టులో మర్కూక్ పంప్ హౌస్ చివరిది.  కాళేశ్వరం ద్వారా నీటిని 88 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళాలనేది ఆలోచన.  
 
ఈ మేరకు మర్కూక్ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే కొత్తగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది.  ఇందులో 530 మీటర్ల ఎత్తు వరకు నీటిని లిఫ్ట్ చేస్తారు.  అనంతరం ఈ జలాలను గ్రావిటీ ద్వారా పలు ప్రాంతాలకు పంపాలనేది ప్రణాళిక.  ఈమేరకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కొండపోచమ్మ రిజర్వాయరును సిద్దం చేశారు.  కొద్దిసేపటి క్రితమే చినజీయర్ స్వామితో కలిసి కేసీఆర్ మర్కూర్ పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేశారు.  మరుక్షణమే గోదారమ్మ పరవళ్లు కొండపోచమ్మ రిజర్వాయరులోకి ప్రవేశించింది. 
 
దీంతో లక్షలాది ఎకరాలను గోదావరి జలాలతో తడపాలన్న కేసీఆర్ కల నిజమైంది.  15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా రెండు లక్షల 85 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.  ఈ భూములు సిద్దిపేట, మెదక్, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.  అంతేకాదు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా నీరందుతుంది.  ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు గోదావరిని అరకిలోమీటరు పైకి ఎత్తాలంటే ఇంజనీరింగ్ అద్భుతాలు చేయాలి, ఇది జరిగే పనేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.  కానీ కేసీఆర్ వేటికీ జడవలేదు.  అహర్నిశలూ కష్టపడి ప్రాజెక్టును ముందుకు నడిపారు.  పట్టుబట్టి గోదారమ్మను కొండపోచమ్మ చెంతకు తీసుకొచ్చారు.  ఈ జాలాద్బుతాన్ని చూసిన తెలంగాణ ప్రజానీకం అపర భగీరథుడు మా కేసీఆర్ అంటూ కొనియాడుతున్నారు.