ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నద్దమయ్యారు. ప్రజెంట్ ఉన్న 13 జిల్లాలకు ఇంకో 12 కొత్త జిల్లాలను కలిపి మొత్తం 25 జిల్లాలుగా చేయాలనేది ప్లాన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తారట. ఈ మేరకు రానున్న కొత్త జిల్లాలు ఏవి, వాటిలోకి చేరబోయే మండలాలు ఏవి అనే వివరాలు బయటికొచ్చాయి. వాటిని పరిశీలిస్తే పాత జిల్లాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు కొత్త జిల్లాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ పరిణామం ఆయా జిల్లాల ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా నచ్చడం లేదు.
ఈ ప్రజాప్రతినిధుల్లో టీడీపీ నేతలతో పాటు వైకాపా నేతలు కూడా ఉండటం గమనార్హం. కొత్త జిల్లాల అంశం మీద వైఎస్ జగన్ మాట్లాడిన వెంటనే రియాక్ట్ అయిన శ్రీకాకుళం నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడమనే ఆలోచన సరికాదన్నారు. పునర్విభజనలో ఇప్పటివరకు శ్రీకాకుళంలో భాగంగా ఉన్న ముఖ్యమైన రాజాం, పాలకొండ, ఎచ్చర్లలు విజయనగరం జిల్లా కిందకి వెళ్లిపోతాయి. ముఖ్యమైన ఆ మూడు ప్రాంతాలు లేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకోవాలంటేనే భయంగా ఉందని ధర్మాన అన్నారు.
ఈ విషయమై సీఎం మరోసారి ఆలోచించాలని సలహా ఇచ్చారు. స్పీకర్ తమ్మినేని సైతం జిల్లాల పునర్విభజన విషయంలో సీఎం ఇతర నేతల అభిప్రాయాలను, సలహాలను స్వీకరిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. ఇలా ఆరంభంలోనే సొంత నేతల నుండే అభ్యంతరం రావడం ముఖ్యమంత్రిని ఇరుకునపెట్టే విషయమే. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో కొందరు నేతలు పలు కారణాల రీత్యా సంతృప్తితో ఉన్నారు. తమకు ప్రాముఖ్యత దక్కడం లేదనే దిగులుతో ఉన్నారు. అలాంటివారికి అధిష్టానం మీద ఒత్తిడి తేవడానికి కొత్త జిల్లాల అంశం ఒక అవకాశంగా ఉపయోగపడవచ్చు. ఇక నిజంగానే ప్రాంతీయతా సెంటిమెంట్ల మూలంగా ఎదురు తిరిగే వారు కూడా కొందరు తయారవుతారు. సో.. కొత్త జిల్లాలతో పాటు వైకాపాలో కొత్త రెబల్స్ తయారుకానున్నారన్నమాట.